రాయ‌ల‌సీమ ప్రాంతంలోని ప్రాజెక్టుల‌కు  గ‌త ప్ర‌భుత్వం మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించ‌క‌పోవ‌డంతో వెల‌వెల‌బోతున్నాయ‌ని, దీనికంత‌టికి కార‌ణం చంద్ర‌బాబు వైఫ‌ల్య‌మేన‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీలో బుధ‌వారం ఎండ‌గట్టారు.  ' ఇంతగా వర్షాలు పడి.. దేవుడు ఈ సంవత్సరం మంచిగా నీళ్లు ఇచ్చినా రాయలసీమ ప్రాజెక్టులకు నింపుకోలేక‌పోయాం ' అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబును చూస్తే అసలు మనిషేనా అని అనిపిస్తోందని మండిపడ్డారు.  చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పనులు పూర్తి చేసి ఉంటే ప్ర‌స్తుతం ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని దుయ్య‌బ‌ట్టారు. 

 

ప్రాజెక్టుల మరమ్మతులు పూర్తిచేసి.. కాల్వల సామర్థ్యాన్ని పెంచి ఉంటే.. ప్రతి బొట్టు జ‌ల‌శ‌యాల‌కు చేరి పంట‌పొలాల‌కు మళ్లి ఉండేవ‌ని అన్నారు. అయితే ఆరునెల‌ల కాలంలో మా ప్ర‌భుత్వం నీటిపారుద‌ల రంగంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింద‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. రామలసీమలోని ప్రాజెక్టులు మళ్లీ పుష్కలమైన నీళ్లతో కళకళలాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రాజెక్టుల్లో ప్ర‌స్తుతం నీటి నిల్వ స్థితిగ‌తుల‌ను అసెంబ్లీలో జ‌గ‌న్ చ‌దివి వినిపించారు.  'గోరుకల్లు ప్రాజెక్టు సామర్థ్యం 12.44 టీఎంసీలకుగాను 8 టీఎంసీలు మాత్రమే నీరు చేరింది.  గొల్లపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 1.91 టీఎంసీలకుగాను ఒక్క టీఎంసీ మాత్రమే నీరు నిల్వ ఉంది. 

 

అనంతపురం రియర్వాయర్‌లో 5 టీఎంసీలకుగాను 3 టీఎంసీలు, చిత్రవతిలో 10టీఎంసీలకుగాను 6.8 టీఎంసీలు నీళ్లు నిల్వ చేయగలిగామ‌న్నారు. గండికోటలో 26.85 టీఎంసీలకుగాను 12 టీఎంసీలు ,  బ్రహ్మం సాగర్‌లో 17.97 టీఎంసీలకుగాను 6.9 టీఎంసీలు, సరళసాగర్‌లో 3 టీఎంసీలకు ఒక్క టీఎంసీ, వెలిగోడు ప్రాజెక్టుకు అస‌లు నీళ్లే రావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను ఎండ‌గ‌డుతూనే రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వివ‌రించారు. 'పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరి సామర్థ్యాన్ని 44 క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచబోతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. 

 

తెలుగు గంగ కెనాల్‌ను 11500 క్యూసెక్కుల నుంచి 18వేల క్యూసెక్కులకు, ఎస్సార్‌బీసీ కెనాల్‌ను 21వేల క్యూసెక్కుల నుచి 31వేల వరకు, కేసీ కెనాల్‌ 12500 క్యూసెక్కుల నుంచి 35వేల క్యూసెక్కుల వరకు, అవుకు టన్నెల్‌ కెనాల్‌ 10 క్యూసెక్కుల నుంచి 30వేల క్యూసెక్కులకు పెంచబోతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.  తెలుగు గంగ మెయిన్‌ కెనాల్‌ టు వైఎస్సార్‌ కడప సామర్థ్యాన్ని 3500 క్యూసెక్కుల నుంచి 8 వేల క్యూసెక్కులకు పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. గండికోట టు సీబీఆర్‌ లిఫ్ట్‌ను రెండువేల క్యూసెక్కుల నుంచి నాలుగువేల క్యూసెక్కులకు, గండికోట టు జీఏఎన్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ నాలుగు వేల నుంచి ఆరువేల క్యూసెక్కులకు తీసుకుపోయేందుకు చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: