తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, కేంద్ర ప్ర‌భుత్వంతో కొద్ది రోజులుగా చెడింద‌న్న ప్ర‌చారం అయితే జ‌రుగుతూ వ‌స్తోంది. ఈ యేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎన్డీయే ఘ‌న‌విజ‌యం సాధించి, మోడీ రెండో సారి ప్ర‌ధాన మంత్రి అయ్యాక కేసీఆర్‌కు, మోడీకి ట‌ర్మ్స్ తేడా అయితే వ‌చ్చాయ‌న్న‌ది నిజం. ఇక తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచు కోవ‌డంతో బీజేపీ సైతం తెలంగాణ లో ప‌ట్టు కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఇక కేంద్ర నుంచి ఆశించిన మేర నిధులు కూడా తెలంగాణ కు రావ‌డం లేదు. దీంతో ఓపిక న‌శించ‌డంతో టీఆర్ఎస్ ఢిల్లీ నాయ‌క‌త్వంతో యుద్ధం మొద‌లు పెట్టిన‌ట్టే తెలుస్తోంది. తాజాగా బుధ‌వారం పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతోన్న వేళ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు.

 

కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి నిధులు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. దీనిని బ‌ట్టి కేంద్ర ప్ర‌భుత్వం నిధుల విష‌యంలో తెలంగాణ‌పై శీత‌క‌న్ను వేసింద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

ఇక ఇదే అంశంపై ఈ నెల 7వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని లేఖలో కేసీఆర్ కోరారు. ఇటీవలి కాలంలో కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. రెండు రోజుల క్రితం కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు వేసింది. గత ఆరేళ్లుగా కేంద్రం ప్రతిపాదించిన ప్రతి బిల్లులూ మద్దతు ఇస్తూ వస్తున్న టీఆర్ఎస్, ఈసారి మాత్రం వ్యతిరేకంగా నిలిచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: