శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పై పలు విచారణలు జరుగుతున్నాయి. ఒకవైపు జాతీయ మానవ హక్కుల సంఘం మరోవైపు తెలంగాణ హై కోర్టు ఇంకోవైపు సుప్రీం కోర్టు ఇలా పలు విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ హై కోర్టు ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన నిందితుల మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది. తెలంగాణ హై కోర్టులో కూడా దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై పిటిషన్లు నమోదు అయ్యాయి. దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టులోనూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై రెండు పిల్స్ నమోదు అయ్యాయి.

 

ఈ నేపథ్యంలో నిన్న (డిసెంబర్ 11) సీపీ సజ్జనార్ సుప్రీం కోర్టు కు హాజరు అయ్యారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై తెలంగాణ పోలీసుల వాదనను వినిపించడానికి ఒక న్యాయవాదిని నియమించుకున్నారు. సుప్రీం కోర్టు అడిగే ప్రశ్నలకు ఏవిధంగా సమాధానం చెప్పాలో లాయర్ కి సజ్జనార్ వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులను ఉద్దెశించి "మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు అని పిటిషనర్ చెప్తున్నారు దీనిపై మీరు ఏం చెప్తారు" అని సుప్రీం అడిగినట్లు తెలుస్తోంది.

 

ఇక దీనికి సమాధానంగా దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్కు దారి తీసిన పరిస్థితులు, క్రైమ్ సీన్ రీ కంస్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పోలీసులపై దాడి చేసిన తదితర అంశాల గురించి సుప్రీం కోర్టు జడ్జికి సజ్జనార్ సమాధానంగా లాయర్ చెప్పినట్లు సమాచారం. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి చేత విచారించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే తెలంగాణ పోలీసులు వాదనలకు సుప్రీం కోర్టు సంతృప్తి చెందలేదని అందుకే విచారణను సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో జరిపించాలని భావించినట్లు న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం కోర్టు విచారణను ఈరోజు కు వాయిదా వేసింది. నేడు కూడా దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పై సుప్రీంలో విచారణ కొనసాగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: