అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 18 పిటిషన్లను సర్వోన్నత న్యాయస్ధానం తిరస్కరించింది. నవంబర్‌ 9న వెలువరించిన నిర్ణయమే తుది తీర్పని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. 


అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిటిషన్లను మిగతా కేసుల మాదిరిగా సాధారణ విధానాన్ని అనుసరించకుండా ప్రత్యేక ఛాంబర్‌లో విచారణ చేశారు. తీర్పుపై సమీక్ష కోరుతూ దాఖలైన 18 రివ్యూ పిటిషన్లను సీజేఐ తిరస్కరించారు. రివ్యూ పిటిషన్లపై ఛాంబర్‌లో సీజేఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అంతర్గత విచారణ జరిపింది. 

 

అయోధ్య భూవివాదంపై నవంబర్‌ 9న అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ మందిర నిర్మాణానికి వీలుగా రామ్‌లల్లాకు అప్పగించాలని తీర్పులో పేర్కొంది. సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదెకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ తీర్పుపై డిసెంబర్‌ 2న తొలి రివ్యూ పిటిషన్‌ దాఖలైంది.
 
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం తీర్పును సవాల్‌ చేస్తూ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, నిర్మోహి అఖాడా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. అయోధ్య తీర్పును సవాల్‌ చేస్తూ 40 మంది సామాజిక కార్యకర్తలు సైతం రివ్యూ పిటిషన్లు వేశారు.


నవంబర్‌ 9న అయోధ్య కేసులో తీర్పు వెలువడగా.. డిసెంబర్‌ 2న తొలి రివ్యూ పిటిషన్‌ దాఖలైంది.  ఉలేమా ఏ హింద్‌ అధ్యక్షుడు సయ్యద్‌ అష్షద్‌ రషీదీ ఈ పిటిషన్‌ వేశారు. కాగా, ప్రముఖ స్థలంలో మసీదు కోసం ఐదెకరాలు కేటాయించమనడాన్ని సవాల్‌ చేస్తూ హిందూ మహాసభ తరపున పిటిషన్‌ దాఖలైంది. మొత్తంగా ముస్లింల తరపున ఆరు రివ్యూ పిటిషన్లు దాఖలు కాగా, ఒక పిటిషన్‌ హిందూ సంస్థ తరపున దాఖలైంది. వీటిపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: