ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నేపథ్యంలో వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యంలోని  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు కీలక ముందడుగు వేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగెనెస్ట్‌ వుమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కాగా, ఈ బిల్లుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ద్ద‌తు ప‌లికారు. 'దిశ' బిల్లు కాపీని ఈ రోజే తమకు ఇచ్చారని.. ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదనీ.. ఈ బిల్లులో చేసిన సవరణలు కూడా తాము ఆమోదిస్తున్నట్టు తెలిపారు. 

 

దిశ‌ బిల్లును హోంమంత్రి సుచరిత సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చలో భాగంగా  ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఎంత చొరవతో ఈ బిల్లు తీసుకొచ్చారో దీన్ని అమలు చేయడంలో అదే ఉత్సాహం చూపించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చంద్ర‌బాబు కోరారు. చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వం కూడా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మ‌హిళల భద్రత గురించి ప్రత్యేక చట్టం తీసుకురావడాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు.దేశంలో ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయనీ.. వాటన్నింటినీ అధ్యయనం చేసి అవసరమైతే కేంద్రాన్ని కూడా సంప్రదించాలని సూచించారు. చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో, ఉన్న సమస్యల్ని అధిగమించుకుంటూ వాటిని అమలు చేయడం అంతకన్నా ముఖ్యమైందన్నారు. ఈ చట్టం అమలులో నిర్లక్ష్యం వద్దని తెలిపారు. ఈ బిల్లుకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు త‌మ ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధిగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తెలిపారు. దీంతోపాటుగా ఈ బిల్లు తీసుకురావడానికి గల కారణాలను వివరించారు. మహిళలు, చిన్నారులపై దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని...వీటిని నివారించాలంటే ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమని చెప్పారు. అనంతరం ఈ బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు. గవర్నర్‌ ఆమోదం తర్వాత ‘దిశ’ బిల్లు చట్టంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: