విజయవాడ ఆయేషా మీరా మర్డర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా హత్య కేసును కొన్నిరోజుల కిందట సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ క్ర‌మంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో సంచలన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసింది. ఆయేషా మీరా మృతదేహానికి 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత రీపోస్ట్‌మార్టం నిర్వహించబోతోంది. ప్రస్తుతం మత పెద్దలు, కుటుంబ సభ్యులు, రెవెన్యూ అధికారులు..ఈ ఖననానికి సంబంధించి అనుమతి ఇచ్చారు. 

 

ఈ నేప‌థ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు రీ-పోస్టుమార్టం చేస్తున్నారు.  ఈ సందర్భంగా ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురిని చంపిందెవరో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలుసని అన్నారు. తన కూతురు హత్యకు గురైన తర్వాత రోజా ఎంతో హడావుడి చేశారని... నేరస్తులెవరో ఆమెకు తెలుసని అన్నారు. వారి గురించి అసెంబ్లీలో రోజా ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నాయకులకు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలని శంషాద్ బేగం అన్నారు. మధ్యతరగతి, పేదలకు ఎప్పుడూ న్యాయం జరగదని చెప్పారు. 

 

మ‌రియు 21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటామన్న సీఎం జగన్... ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదని బేగం ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు. కాగా, కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి ఆమెని చంపేశారు. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ.. అసలు దోషులెవరో బయటపడలేదు. దీంతో ప్ర‌స్తుతం ఈ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: