2007 డిసెంబర్ లో ఘోరంగా అత్యాచారం చేయబడి, హత్య గావింపబడ్డ విజయవాడ యువతి ఆయేషా మీరా హత్యోదంతంపై అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆమె హత్యోదంతంపై ప్రభుత్వం సత్వరమే విచారణ చేపట్టి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పలు మహిళా మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ కేసును ఎంతో సీరియస్ గా తీసుకున్న అప్పటి ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ వారు, తరువాత ఆ కేసులో నిందితుడైన సత్యం బాబును విచారణ అనంతరం 2008 ఆగష్టులో అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరుపరచగా, 

 

విజయవాడ మహిళా సెషన్స్ కోర్ట్ అతడికి 14 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే ఎనిమిదేళ్ల శిక్ష అనుభవించిన తరువాత ఇటీవల సత్యంబాబు జైలు నుండి బెయిలు పై రిలీజ్ అయ్యాడు. అయితే ఈ కేసులో సిబిఐ విచారణ చేపట్టాలని అయేషా తల్లిదండ్రులు కోరడంతో 2018, నవంబర్ 29న సిబిఐ విచారణకు హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దానితో 2019లో విచారణ ప్రారంభించిన సిబిఐ అధికారులు, అందులో భాగంగా నిన్న ఆమె మృతదేహానికి రి పోస్టుమార్టం నిర్వహించారు. సిబిఐ ఎస్పీ విమల్ ఆధ్వర్యంలో కొందరు ఫోరెన్సిక్ బృదం నిపుణులు అయేషా మృతదేహాన్ని సునిశితంగా పరిశీలించి ఆమె మృతదేహం పై అలానే పుర్రె పై కొన్ని గాయాల గాట్లు ఉన్నట్లు గుర్తించారు. 

 

అనంతరం మృతదేహం నుండి కొన్ని కీలక అవశేషాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలుస్తోంది. తెనాలి సబ్ కలెక్టర్ మరియు ఎమ్మార్వో ఆధ్వర్యంలో జరిగిన ఈ శవ పంచనామా అనంతరం ఆమె మృతదేహాన్ని పలువురు మత పెద్దల పర్యవేక్షణలో తిరిగి ఖననం చేయడం జరిగింది. కాగా ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాత వాటి రిపోర్టులను హైకోర్టుకు సీల్డు సమర్పించనున్నారు సిబిఐ అధికారులు. కాగా సిబిఐ నివేదిక తరువాత తప్పకుండా నిజానిజాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని, అప్పుడే తమ బిడ్డ ఆత్మకు నిజంగా శాంతి కలుగుతుందని అయేషా తల్లిదండ్రలు అంటున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: