ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల సందడి కనిపించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన వైసీపీ.. మరోసారి తన సత్తా చూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. త్వరలో మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఏపీలో రాజకీయం మళ్లీ వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లాపడ్డ తెలుగుదేశం ఈ ఎన్నికల్లో కాస్త పుంజుకుని ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

 

విశాఖ పర్యటనలో ఉన్న మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం వెల్లడించారు. అంతేకాదు.. ఆయన రాష్ట్ర రాజకీయాలపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శాసనసభను తెలుగుదేశం పార్టీ సజావుగా జరగనివ్వడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మార్షల్స్, ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చ జరగనివ్వకుండా రాద్ధాంతం చేస్తూ సభా సమయాన్ని వృథా చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 

చంద్రబాబుకు రోజురోజుకు అసహనం పెరిగిందన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా అవినీతి తాండవించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాడని, కాంట్రాక్టులు, పథకాల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టారీతిగా ప్రజాధనాన్ని దోచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ఆరు నెలల పాలనలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకున్నారన్నారు. మేనిఫెస్టోలోని అంశాలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటిస్తోందని, త్వరలో ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఆ నివేదికలో రాజధాని అంశం కూడా ఉంటుందన్నారు. రాజధాని రైతులను ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటామని చెప్పారు. విశాఖ మెట్రోను రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, భోగాపురం ఎయిర్‌పోర్టు రీటెండరింగ్‌ ఇంకా నిర్ధారణ కాలేదని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: