దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్ర‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న త‌రుణంలో...కేంద్రం కొత్త బ‌డ్జెట్ సిద్ధం చేసేందుకు క‌స‌ర‌త్తు సాగుతోంది.  2020-21 బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై సలహాలు, సూచనల కోసం ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు షెడ్యూల్ సిద్ధ‌మైంది. ఈ నెల 18న ఢిల్లీలో ప్రీబడ్జెట్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలితప్రాంతాల ఆర్థికశాఖ మంత్రులను కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ కోరింది.  మ‌రోవైపు సోమ‌వారం సాయంత్రం అంకుర, ఫిన్ టెక్, డిజిటల్ రంగాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించనున్నారు. 2020-21 బడ్జెట్‌కు సంబంధించి వారి అభిప్రాయాలు స్వీక‌రించ‌నున్నారు. 

 


కాగా, దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సీనియర్‌ అధికారులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వృద్ధిరేటుకు ఊతమిచ్చేందుకు అవసరమైతే ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని ఆమె చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని మీరు భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అంచనాలతో కూడిన ఎలాంటి వ్యవహారాల జోలికి నేను వెళ్లదల్చుకోలేదు. ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్నా. అవసరమైనచోట జోక్యం చేసుకొంటున్నా. పారిశ్రామికరంగంలో సమస్యలు పెరిగినప్పుడు వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తున్నా’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఓవైపు దేశ ఆర్థికాభివృద్ధిరేటు గణనీయంగా క్షీణించడం, మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగడం (స్టాగ్‌ఫ్లేషన్‌)పై ప్రతిస్పందించేందుకు ఆమె నిరాకరించారు. 

 

మ‌రోవైపు బ‌డ్జెట్ క‌స‌ర‌త్తులో ప్ర‌క్రియ వేగిరం చేస్తున్న‌ట్లు స‌మాచారం. సోమ‌వారం ఉద‌యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అంకుర, ఫిన్ టెక్, డిజిటల్ రంగాల ప్రతినిధులతో జరుగుతుంది. సాయంత్రం ఫైనాన్సియ‌ల్ రంగం, కాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశముంది. జనవరి 25 లోపు సంప్రదింపుల ప్రక్రియ ముగించి,  ఫిబ్రవరి 1న పార్లమెంటులో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: