ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంతోమంది అమాయకులను బలితీసుకున్న కాల్‌మ‌నీ  మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో క‌ల‌క‌లం రేగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రూ.6లక్షలు అప్పు ఇచ్చి రూ.23లక్షలు వడ్డీ వసూలు చేశారని బాధితుడు ఆరోపించాడు. డబ్బులు కట్టకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాల్‌మనీ వ్యాపారుల నుంచి కాపాడాలని నిరసనకు దిగాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి కాల్‌మనీ బాధితుడు ఉండవల్లికి చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నా వెంకటేష్‌ను స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు.

 


ఇదిలాఉండ‌గా, కొద్దికాలం క్రితం సైతం గుంటూరు జిల్లాలో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపింది.గుంటూరు జిల్లా ట్రజరీ కార్యాలయంలో అజిమున్నీసా సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది. వినుకొండ కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో ఇన్నమూరి మాధవరావు నుంచి అజిమున్నీసా మూడు లక్షలు అప్పు తీసుకుంది. బదులుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులను మాధవరావు తీసుకున్నారు. అప్పటి నుండి నెలనెలా వడ్డీతో పాటు అసలు కూడా చెల్లిస్తూ ఏడున్నర లక్షల రూపాయలను చెల్లించింది. అయినా ఇంకా చెల్లించాలంటూ ఆమెను వేధించాడు. డబ్బులు ఇవ్వకుంటే అక్రమ కేసులు పెడతామని, తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించక పోవడంతో ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చి.. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అనంత‌రం కోలుకుంది.

 

కాగా, అలా దాదాపు రెండు నెల‌ల కింద‌ట చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న అనంత‌రం మ‌ళ్లీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రూ.6 లక్షల అప్పు ఇచ్చి రూ.23లక్షల వడ్డీ వ‌సూలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రోవైపు స్వ‌ల్ప‌కాలంలోనే రెండు కాల్‌మ‌నీ ఉదంతాలు తెర‌మీద‌కు రావ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: