ఓ రాష్ట్ర సీఎం త‌మ్ముడిని అగంత‌కులు కిడ్నాప్ చేశారు. ఆయ‌న్ను విడుద‌ల చేయాలంటే త‌మ‌కు 15 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకోవాల‌ని డిమాండ్ చేశారు. అయితే, ఈ సీన్‌లోకి ముఖ్య‌మంత్రి సోద‌రుడి భార్య రావ‌డంతో...క‌థ మొత్తం అడ్డం తిరిగింది. క‌ట్ చేస్తే ఆ నిందితులు జైలు పాల‌య్యారు. ఈ కలకలం రేపిన ఘ‌ట‌న‌లో బాధితుడు మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌సింగ్‌ సోదరుడు.

 


కోల్‌క‌తా పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ... మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌సింగ్‌ సోదరుడు లుఖోయిసింగ్ కోల్‌కతా న్యూటౌన్‌ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. ఆయ‌న ఇంట్లో ఐదుగురు దుండగులు ప్రవేశించారు. తాము సీబీఐ అధికారులమని చెప్తూ బొమ్మ తుపాకీలు చూపించి సీఎం సోద‌రుడితో పాటు సహాయకుడిని కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత దుండగులు...లుఖోయిసింగ్‌ భార్యకు ఫోన్ చేసి రూ.15 లక్షలు తీసుకొస్తేనే విడిచిపెడతామని డిమాండ్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని బెనియాపుకూర్‌ ప్రాంతంలో ఐదుగురు దుండగులను అరెస్టు చేసి, కిడ్నాపైన ణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌సింగ్‌ సోదరుడు లుఖోయిసింగ్, సహాయకుడిని  సురక్షితంగా కాపాడినట్టు  తెలిపారు. 

 

నిందితుల్లో ఇద్దరిది మణిపూర్‌, మరో ఇద్దరిది కోల్‌కతా కాగా మరొకరిది పంజాబ్‌ అని తేల్చారు. కోల్‌కతాకు చెందిన నిందితులకు నేరచరిత్ర ఉన్నట్టు గుర్తించారు. నిందితులు దొరికిన ప్రాంతంలో రెండు వాహనాలను, మూడు బొమ్మ తుపాకీలు, రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, బొమ్మ తుపాకితో సీఎం త‌మ్ముడినే కిడ్నాప్ చేసేందుకు వేసిన ఈ ఎత్తుగ‌డ, దాన్ని పోలీసులు గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఛేదించిన తీరు పెద్ద ఎత్తున సంచ‌లనంగా మారింది.కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితులను పట్టుకున్న కోల్‌కతా పోలీసులను ఉన్న‌తాధికారులు అభినందించారు. ముఖ్య‌మంత్రి సోద‌రుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం చేసినందుకు ఈ ఆప‌రేష‌న్లో పాల్గొన్న వారికి రివార్డులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: