గత ఐదేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆర్టీసీ యాజ మాన్యం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తొలి విడతలో 2015 డిసెంబర్‌ 31 వరకు 237 మంది పేర్లతో ఉన్న జాబితాను ఆమోదించింది. వీరందరికీ మెడికల్‌ పరీక్షలు నిర్వహించి శిక్షణకు పంపించారు. కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెం.మీల నుంచి 145 సెం.మీలకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు. అలాగే డిస్‌ ఎంగేజ్‌ (డ్యూటీకి గైర్హాజరైన వారు) అయిన మొత్తం 135 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి  తీసుకున్నారు. 


2015 తర్వాత కారుణ్య నియామకాలను త్వరలో చేపట్టేందుకు.. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో కార్మిక సంఘాలన్నీ హర్షం వ్యక్తంచేస్తున్నాయి. విలీన వేళ ఆర్టీసీ కార్మికులకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయాలు అమలుచేయనున్నారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటుచేసి ఆర్టీసీ సిబ్బంది మొత్తాన్ని ప్రభుత్వోద్యోగులుగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఈ నెల 11న ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి కొత్త చట్టాన్ని సోమ లేదా మంగళవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఉద్యోగులకు వరాలు ప్రకటించింది. 

కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 40 శాతం వేతన సవరణ బకాయిలు చెల్లించడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల మొత్తం రూ.210 కోట్లను విడుదల చేసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధి నిర్వహణలో మరణిస్తున్న ఘటనలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీలో సుమారు 52 వేల మందికి ముందస్తుగా అన్ని రకాల వైద్య పరీక్షలు అందనున్నాయి. ఇప్పటివరకు ఇలా కంటి పరీక్షలు మాత్రమే నిర్వహించే వారు. సర్కారు తాజా నిర్ణయంతో ఇకపై అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: