కొమ్మూరి శ్రీనివాస్ అనే ఏపీ ఐటీ ఉద్యోగి వేములవాడ పోలీస్ స్టేషన్ కు గూగుల్ రివ్యూ ఇచ్చారు. సాధారణంగా హోటల్, రెస్టారెంట్, సినీ థియేటర్స్, సూపర్ మర్కెట్స్ ఇంకా తదితర సేవలకు గూగుల్ రివ్యూ ఇవ్వడం చూస్తాం. కానీ పోలీస్ స్టేషన్ లకు రివ్యూ ఇవ్వడం మాత్రం చాలా అరుదుగా చూస్తాం. 4 రోజుల క్రితం ఒక వ్యక్తి చెన్నై పోలీస్ స్టేషన్లో రివ్యూ ఇచ్చారు. ఆ తర్వాత కొమ్మూరి శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కి రివ్యూ ఇచ్చి ఫేమస్ అయిన రెండో వ్యక్తి.

ఇంతకీ రివ్యూ లో ఏం రాసి ఉందంటే...

'సోమవారం రోజు శివుడి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వేములవాడకు మా ఫ్యామిలీ తో సహా నేను కారులో బయల్దేరాను. ఆ రోజు సోమవారం కావడంతో శివాలయం వద్ద జనాభా ఎక్కువగా ఉన్నారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో శివుడి దర్శనం చేసుకుని హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం ప్రారంభించాను. కానీ దురదృష్టవశాత్తు, నేను కారు నడుపుతున్న సమయంలో టెంపుల్ సమీపంలో ఉన్న ఒక మార్గంలో... రాంగ్ రూట్ లో వస్తున్న మరొక కారు వచ్చి నా కారును ఢీకొట్టింది. రెండు కార్ల ముందు భాగాలు యాక్సిడెంట్ కారణంగా డామేజ్ అయ్యాయి. తప్పు అతనిది అయినప్పటికీ... స్థానిక వ్యక్తి కాబట్టి నన్ను తిట్టడం... మీద చేయి వేయటం స్టార్ట్ చేసాడు. అతను అలా చేస్తుంటే నేను షాకయ్యను... కొన్ని సెకన్ల పాటు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో మేము ఉన్నాము. మా నాన్న.. జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే.. అతనిపై కూడా చెయ్యి చేసుకున్నాడు. ఇంకా రెచ్చిపోయి నా కారు తాళాలను లాక్కున్నాడు.


'చుట్టూ కొంత మంది గుమిగూడారు కానీ.. వాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా (వేములవాడ) ఎస్పీ రాహుల్ హెగ్డే సామాజిక మాధ్యమాలలో ఉన్నారని... ఏదైనా సమస్యను అతనికి తెలియపరిస్తే వెంటనే స్పందిస్తారని తెలుసుకున్నాను. ఇంతలోపే మా భార్య 100 కి డయల్ చేసి పోలీసులకి ఈ సంఘటన గురించి తెలియజేసింది. అయితే వారు వెంటనే 5 నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. నా జీవితంలో పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం అదే తొలిసారి. పోలీస్ స్టేషన్ చాలా శుభ్రంగా ఉంది. అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ నన్ను ఒక కుర్చీలో కూర్చోమన్నారు. అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అక్కడే ఉన్న పోలీసులతో చాలా చనువుగా మాట్లాడుతున్నాడు. దాంతో పోలీసులు అతనికి బాగా తెలిసిన వారని అర్థమైంది. ఒకవేళ పోలీసులకు నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తినని తెలిస్తే.. నన్ను వదిలి పెట్టరని, డబ్బులు అడుగుతారని అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను. ఈ క్రమంలోనే... రాహుల్ హెగ్డే నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది.'

ఆ మెసేజ్ లో ఏం రాసి ఉందంటే.. 'మిస్టర్.. శ్రీనివాస్. నేను ఇప్పుడే వేములవాడ స్థానిక పోలీస్ స్టేషన్ కు ఇంఫాం చేశాను. నీ డిటేల్స్ ని వాళ్లకి తెలియపరచాను. తొందరలోనే ఆ పోలీసులు మీరు ఉన్న ప్లేస్ కు చేరుకుంటారు. భయపడకండి.. మేము ఉన్నది మీకు హెల్ప్ చేయడానికే. మీకు ఇంకా ఏమైనా సహాయం కావాలనుకుంటే... నాకు వెంటనే డైరెక్ట్ గా ఫోన్ చేయండి. 8332831100.' అని ఎస్పీ రాహుల్ హెగ్డే నుంచి ఒక మెసేజ్ వచ్చింది.

'నేను ఆ మెసేజ్ చదవగానే... జిల్లా స్థానిక సీఐ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ సీఐ కు జరిగిన విషయం అంతా చెప్పాను. దాంతో.. స్థానిక కానిస్టేబుల్ తో సమీపంలోనే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించామని చెప్పారు. వారి వెరిఫికేషన్ జరిగిన తర్వాత.. రాంగ్ రూట్ లో వచ్చి ఆ కారును ఢీ కొట్టిన వ్యక్తిదే తప్పని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ ఆ స్థానిక వ్యక్తిని అరెస్టు చేయమని కానిస్టేబుళ్లను ఆదేశించాడు.'

'వేములవాడ పోలీస్ సర్వీస్ ను చూసి నేను ఆశ్చర్యపోయాను. వెంటనే స్పందించిన పోలీసులకు నా ధన్యవాదాలు. నేను ఎప్పుడూ అనుకోలేదు పోలీసు అధికారులు ఇంత త్వరగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని. సోషల్ మీడియాలో స్పందించి, టెక్నాలజీని బాగా యూస్ చేసుకొని వేగంగా విచారణ చేపట్టారు. ఆ సీఐ అయితే చాలా ఫాస్ట్ గా స్పందించారు. సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే సార్ కు, సీఐకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. హాట్సాఫ్ టూ తెలంగాణ పోలీస్.' అని రాశారు.

ప్రస్తుతం ఈ గూగుల్ రివ్యూ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మీరు ఈ గూగుల్ రివ్యూ చదవాలనుకుంటే.. 'వేములవాడ పోలీస్ స్టేషన్' అని గూగుల్ లో ఆంగ్లంలో సెర్చ్ చేయండి. మొట్టమొదటిగా వేములవాడ పోలీస్ స్టేషన్ అని తెలుగులో కనిపిస్తుంది. తర్వాత 'సమీక్షలు' పై క్లిక్ చేస్తే కొమ్మూరి శ్రీనివాస్ రివ్యూ చదవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: