ఓ పోలీసు పెద్దాయ‌న ఆస్తులు క‌ళ్లు బైర్లు క‌మ్మే విధంగా ఉన్నాయి, సిద్దిపేట అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ఇంటిపై యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు రైడ్ చేశారు.  పెద్ద ఎత్తున అక్ర‌మ ఆస్తులు కూడ‌బెట్టార‌నే ఆరోపణల నేపథ్యంలో అధికారులు రైడ్ చేసినట్లుగా సమాచారం. డీసీపీ నరసింహారెడ్డి సిద్దిపేట నివాసంతో పాటు కామారెడ్డి, హైదరాబాద్‌లోని ఇళ్ల‌లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అదేవిధంగా సిద్దిపేట వన్‌టౌన్ కానిస్టేబుల్ ఇంట్లో సైతం యాంటీ కరెప్షన్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టగా.. షాక్‌కు గుర‌య్యే స్థాయిలో ఆస్తులు గుర్తించారు. 

 


ఏసీబీ అధికారులు చేపడుతున్న తనిఖీల్లో సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి అక్రమాస్తులు కోట్లాది రూపాయ‌లుగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అతని ఇంటితో పాటు బినామీల ఇళ్లల్లోనూ ఏసీబీ తనిఖీలు చేపడుతోంది. అతనికి సంబధించిన 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. సిద్దిపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, షాద్‌నగర్‌లలో సోదాలు కొనసాగుతున్నాయి. అతడు అక్రమంగా సంపాదించిన విల్లాలు, వ్యవసాయ భూములు, ప్లాట్లు, బ్యాంకు లాకర్లను యాంటీ కరెప్షన్ బ్యూరో అధికారులు గుర్తించారు. 

 

అన‌ధికార స‌మాచారం ప్ర‌కారం, అడిషిన‌ల్ డీసీపీ కూడగట్టిన అక్రమాస్తులు చూస్తే ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. పెద్ద ఎత్తున భూమ‌లును అన్ని ప్రాంతాల్లో కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. తన ఆస్తుల‌పై ఎప్ప‌టికైనా యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారుల క‌న్నుప‌డుతుంద‌ని, రైడ్లు జ‌రుగుతాయని భావించిన అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి కొంద‌రు బినామీల‌ను సైతం ఏర్పాటు చేసుకున్న‌ట్లు స‌మాచారం. బంధువులు, మిత్రుల‌తో పాటుగా ఓ కానిస్టేబుల్‌ను సైతం త‌న అక్ర‌మాస్తుల య‌జ‌మానిగా చూపించిన‌ట్లు తెలిసి ఏసీబీ అధికారులు షాక్‌కు లోన‌య్యారు. కాగా, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డికి సంబంధించిన సోదాల్లో అధికారులు ఏ మేరకు ఆస్తులు గుర్తించారో, వాటికి సంబంధించిన వివరాలను రేపు మీడియాకు వెల్లడించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: