ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 1వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో సేవలు అందించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మీసేవల ద్వారా పొందిన సర్వీసులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పొందవచ్చు. ఇప్పటివరకు ధ్రువీకరణ పత్రాలను పొందటానికి మీసేవలకు నిర్ణీత రుసుము చెల్లించాల్సి వచ్చేది. ఇకనుండి ఈ సర్వీసులు ప్రజలకు ఉచితంగా అందనున్నాయి. 
 
గ్రామ, వార్డు సచివాలయాలు మెజార్టీ సర్వీసులను ఉచితంగా అందించబోతూ ఉండగా కొన్ని సర్వీసులకు మాత్రమే నామమాత్రపు రుసుములను వసూలు చేయనున్నాయి. విజయవాడ నగరంలో సర్వీస్ ప్రొవైడర్లకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజలు మీసేవ కేంద్రాల ద్వారా పొందుతున్న సేవలు అన్నీ ఇకనుండి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి రానున్నాయి. 
 
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు, మ్యుటేషన్ కు మాత్రమే నామమాత్రపు రుసుములను విధించనున్నట్టు సమాచారం. మిగిలిన సర్వీసులకు మాత్రం ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. మీసేవ సర్వీసులను గ్రామ, వార్డ్ సచివాలయాల్లో నిర్వహించడం కొరకు డిజిటల్ అసెస్టెంట్ లను కూడా నియమించారు. ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా అందించాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు మీసేవ నిర్వాహకులు మాత్రం గ్రామ, వార్డు సచివాలయాలలో మీసేవ సర్వీసులు అందుబాటులోకి తెస్తే తమ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఉచిత సేవలను అందుబాటులోకి తెస్తే దాదాపుగా ఆదాయం పడిపోయినట్లేనని నిర్వాహకులు చెబుతున్నారు. మీసేవ కేంద్రాలు ఉంటాయా...? లేదా..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గ్రామ, వార్డ్ సచివాలయాలలో మీసేవ సర్వీసులు అందుబాటులోకి వస్తే మీసేవ కేంద్రాలు అలంకారప్రాయం అవుతాయి. ప్రభుత్వం నుండి మీసేవ కేంద్రాల గురించి ఎలాంటి స్పష్టత రాకపోవటంతో మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిరసన బాట పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: