రాష్ట్రంపై ఒక రాజ‌కీయ పార్టీ ముద్ర వేయ‌డం మ‌నం చూశాం. కాంగ్రెస్ హ‌యాంలో ఆపార్టీ ప్ర‌జ‌ల‌ను త‌న వైపు తిప్పుకొన్న ప‌రిస్థితి ఉంది. అయితే, త‌ర్వాత కాలంలో ఆత్మ‌గౌరవ నినాదంతో అన్న‌గారు ఎన్టీఆర్ పార్టీ పెట్టి.. ప్ర‌జ‌ల‌ను ఒక్క‌సారిగా త‌న‌వైపు తిప్పుకొనిపార్టీ పెట్టిన మూడు మాసాల్లోనే పార్టీని అధికారంలోకి తీసు కువ‌చ్చారు. మ‌రి అలాంటి చ‌రిష్మా ఉన్న నాయ‌కుడు ఇంకెవ‌రైనా ఉన్నారా? అంటే .. అది దివంగ‌త వైఎస్‌. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు వైఎస్ సుదీర్ఘ పాద‌యాత్ర చేశారు. బ‌హుశ ఏపీలో అదే తొలి పాద‌యాత్ర కావ‌డం గ‌మనార్హం.

 

దీంతో అప్ప‌టి వ‌ర‌కు కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ హ‌వా మొత్తం వ్య‌క్తిగత ఇమేజ్‌గామారిపోయింది. కాంగ్రెస్ అంటే వైఎస్ అనే ప‌రిస్థితి కి మారిపోయింది. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా రెండు సార్లు ఎన్నిక‌లు వ‌చ్చి.. రెండు సార్లూ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, ఆ త‌ర్వాత అదే రేంజ్‌లో ప్ర‌జ‌ల‌కు చేరువైన నాయ‌కుడు జ‌గ‌న్‌. వైఎస్ మ‌ర‌ణంతో పార్టీని పెట్టిన జ‌గ‌న్‌.. పార్టీని అభివృద్ధి ప‌థంలోకి తీసుకువ‌చ్చేందు కు ఎన్నో తిప్పలు ప‌డ్డార‌నేది వాస్త‌వం.

 

ఇక‌, 2014లో స్వ‌ల్ప తేడాతో పార్టీ అధికారం కోల్పోయింది. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. 2019 నాటికి పాద‌యాత్ర కు సిద్ధ‌మ‌య్యారు. అప్ప‌టికే బ‌ల‌మైన ప‌క్షంగా ఉన్న టీడీపీని ఢీ కొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. సుదీర్ఘ పాద‌యాత్ర చేయ‌డం ద్వారానే త‌న ల‌క్ష్యాన్ని సాధించే అవ‌కాశం ఉంటుంద‌నిభావించిన జ‌గ‌న్ పేద‌లు, గ్రామీణుల్లోకి పార్టీని ముందుకు న‌డిపించారు. పాద‌యాత్ర ద్వారా ప్ర‌తి ఒక్క‌రి గుండె చ‌ప్పుడును విన్నారు.

 

ప్ర‌తి వారి స‌మ‌స్య‌ను తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల్లోనే ఆయ‌న దాదాపు రెండేళ్ల పాటు ఉండిపోయారు. పాద‌యాత్ర ద్వారా తెలుసుకున్న విష‌యాల‌ను ఆయ‌న నోట్ చేసుకున్నారు. ఇచ్చిన హామీల‌ను ఆయ‌న రాసుకున్నారు. మొత్తానికి సుదీర్ఘ పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌కు ఒక ఇంటి మ‌నిషిగా మార‌డంతోపాటు రాష్ట్రంలో అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌నేది వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి: