ఏపీ సీఎం జగన్ జన్మదినం ఈరోజు. ఆయన ఏపీ సీఎం అయ్యాక జరుగుతున్న మొదటి జన్మ దినం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ సహా పలువురు జగన్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

 

 

 సీఎం వైయస్‌ జగన్‌కు విషెష్‌ చెబుతూ శనివారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు.

 

 

ఇక వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు  తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఘనంగా నిర్వహించారు.  వైయస్‌  జగన్ జన్మదిన వేడుకల్లో  ఉన్నతాధికారులు పాల్గొని సీఎంతో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎం కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సలహాదారు అజేయ కల్లాం, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హరికృష్ణ, సీఎం కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పారు.

 

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు అదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, విశ్వరూప్, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు సీఎం వైయస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 

 

 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న అభిమానులు వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. జగన్ నిందు నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: