ఇంకా కొన్ని రోజులయితే... వారిద్దరు ఒక్కటై.. కలిసి జీవితాన్ని పంచుకునే వారు. కానీ.. వారిరువురు  ఇప్పుడు కలిసి కాటిని పంచుకుంటున్నారు. వివరాల్లోకి వెలితెే... హైదరాబాద్‌‌ నగరం లో మంగళవారం సాయంత్రం విషాదం నెలకొంది. ఈ ఘటన చందానగర్ సమీపంలోని పాపిరెడ్డి నగర్‌ లో జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని యువతీ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. మృతులను పాపిరెడ్డి నగర్‌ కి  చెందిన మనోహర్, సోనీగా గుర్తించారు. 


అయితే.. వీరి ఇరువురికి ఇటీవలే పెద్దలు వివాహం నిశ్చయించి ఘనంగా ఎంగేజ్‌ మెంట్ నిర్వహించారు. ఫిబ్రవరిలో పెళ్లికి ముహూర్తం కుదరడంతో వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనోహర్, సోనీ పెళ్లి షాపింగ్ చేసేందుకు మంగళవారం చందానగర్‌ కు బయలు దేరారు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద చెత్తాచెదారం పెరిగి కంపు కొడుతుండటంతో వారిద్దరూ రైలు పట్టాలు దాటి అవతలి వైపునకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 


ఒకరికొకరు చేతులు పట్టుకుని పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఎంఎంటీఎస్ రైలు మనోహర్, సోనీని ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రగాయాలతో వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరో నెలన్నరలో పెళ్లి పీటలెక్కాల్సిన జంట ఇలా విగతజీవులుగా మారడంతో మనోహర్, సోనీ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ఆ కుటుంబాలకు వచ్చిన కష్టాన్ని చూసి స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. 


ఈ ప్రమాదం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అండర్ పాస్ బ్రిడ్జి వద్ద భారీగా చెత్తా చెదారం నిండిపోవడంతో అందరూ పట్టాలు దాటుకునే అవతలి వైపునకు వెళ్లాల్సి వస్తోందని, దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే మనోహర్, సోనీ ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: