తెలంగాణ ఆర్టీసీని లాభాల్లోకి మళ్లించే చర్యల్లో భాగంగా కార్గో సేవలను జనవరి 1వ తారీఖు నుండి మొదలుపెట్టాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా మరిన్ని సూచనలు చేశారు. ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్ ద్వారా అన్ని రకాల సరకులను రవాణా చేయాలని సూచించారు. బస్సులను కూడా అందుకు అనుగుణంగా రూపొందించాలని చెప్పారు. సరకు రవాణా కోసం ప్రజలు ఇప్పటిదాకా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని.. ఆ పరిస్థితిని మార్చాలని ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

బుధవారం (డిసెంబర్ 25) ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఆర్టీసీ బస్సులు రోజూ రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలను చుట్టి వస్తున్నాయి. లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. అదే మాదిరిగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ మారుమూల ప్రాంతానికైనా సరకు రవాణా చేయాలి. ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరకు రవాణాను ఇకపై కచ్చితంగా ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్ ద్వారానే చేస్తాం. దీనికి సంబంధించి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేస్తాం’ అని కేసీఆర్ చెప్పారు. 
 
బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు, మద్యం డిపోల నుంచి బ్రాందీ షాపులకు లిక్కర్ సరఫరా, ఆస్పత్రులకు ఔషధాలు ఇలా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి సరకు రవాణా ఇకపై ఆర్టీసీ ద్వారానే జరిగేలా చూడాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజలు ఇకపై ఆర్టీసీలోనే తమ సరకును రవాణా చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. కేవలం రాష్ట్ర పరిధిలోనే కాకుండా తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే ముంబై, భీవాండి, సోలాపూర్, నాగపూర్ తదితర ప్రాంతాలకు కూడా సరకు రవాణా చేయాలని నిర్దేశించారు. 

 

సరకు ఎగుమతి, దిగుమతి కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో చాలా చోట్ల స్టాక్ పాయింట్లు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘సరకు రవాణా ఎక్కువ చేయగలిగితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్టీసీకి లాభాలు కూడా వస్తాయి. ఆర్టీసీ లాభాల బాటన పయనిస్తే ఉద్యోగులకు బోనస్ కూడా ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది. సరకు రవాణా విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: