ఏపీ అసీంబ్లీ లో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న వేళ మరో కొత్త డిమాండ్ ఊపందుకుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం ప్రకటన.. అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందంటూ జీఎన్ రావు కమిటీ నివేదికతో రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం మూడు రాజధానులు.. ఆరు డిమాండ్లు అన్న చందంగా తయారైంది. తాజాగా కర్నూలును రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. 

 

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో ఒరిగేదేమీ లేదని.. అడ్మిని స్ట్రేటివ్ రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయాలని గ్రేటర్ రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని చెబుతున్న నేతలు.. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం రాజధానిని సీమ ప్రజలు త్యాగం చేశారని.. ఇప్పుడైనా సీమకు న్యాయం చేయాలని మాజీ మంత్రి మైసూరా రెడ్డి అన్నారు. 

 

హైకోర్టు ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి ఆస్కారం లేదన్న ఆయన.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లేదా లెజిస్లేచర్ క్యాపిటల్‌గా కర్నూలును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాల్సిందేనని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రాజధాని ఇవ్వకపోతే రాష్ట్రమైనా ఇవ్వాలని ఆయన అన్నారు. రాయలసీమకు మరోసారి అన్యాయం జరిగితే సహించేది లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ మేరకు గ్రేటర్ రాయలసీమ వేదిక తరఫున ముఖ్యమంత్రి జగన్‌ కు లేఖ రాశారు. లేఖ పై మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ డీజీపీలుగా పనిచేసిన అధికారులు సంతకాలు చేసి సీఎం కు పంపడం విశేషం. అయితే మూడు రాజధానుల ప్రకటన తో అమరావతి రైతులు భగ్గుమన్న నేపథ్యంలో రాయలసీమ నేతల కొత్త డిమాండ్ కొత్త తలనొప్పిగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: