దేశ రాజధాని అంటే.. నిత్యం జనాలతో కిటకిటలాడుతూ, ట్రాఫిక్ జామ్‌లతో రోడ్లు నిండుగా కనిపిస్తాయని అంతా భావిస్తారు. కానీ, ఆ రాజధాని నగరంలో అప్పుడప్పుడు ఒకటి, రెండు వాహనాలు, ఒకరిద్దరు రోడ్లపై తిరుగుతూ కనిపిస్తారు. అందుకే, దాన్ని అంతా ఘోస్ట్ క్యాపిటల్ (దెయ్యాల రాజధాని) అని పిలుస్తున్నారు. ఇంగ్లాండ్ రాజధాని లండన్‌ కంటే నాలుగురెట్లు పెద్దదైన ఈ నగరం ఇప్పుడు జనాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నగరానికి ఆ పరిస్థితి ఎందుకు పట్టింది? ప్లానింగ్‌లో లోపమా? లేదా అవసరం లేకుండానే నిధులు తగలేసి రాజధాని నిర్మించారా? ఇంతకీ ఆ రాజధాని ఎక్కడుంది? 

 

2005 సైనిక పాలన తర్వాత మయన్మార్‌ (బర్మా) రాజధానిని య్యాగన్ నుంచి నెపిడాకు మార్చారు. నెపిడా అంటే రాజ సింహాసనం. పేరుకు తగినట్లుగానే రాజధానిని అత్యంత ఆడంబరంగా తీర్చిదిద్దారు. 15 ఏళ్ల కిందటే సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ.28వేల కోట్లు) వెచ్చించి సర్వాంగ సుందరమైన నగరాన్ని నిర్మించారు. 20 లేన్ల జాతీయ రహదారి.. వెడల్పయిన వీధులతో ఉండే ఈ నగరాన్ని చూస్తే వహ్వా అనకుండా ఉండలేరు. జనాభా పెరిగితే భవిష్యత్తులో రాజధానిని మరింత విస్తరించేందుకు కూడా ప్లాన్ చేశారు. కానీ, ఉన్న రాజధానిలోనే జనాలు లేక వెలవెలబోవడాన్ని చూసి పాలకులు కళ్లు తేలేశారు. 

 

మయన్మార్‌ (బర్మా) రాజధాని నెపిడాలో అడుగుపెడితే.. భూలోక స్వర్గంలోకి వెళ్తున్నామని అనే భావన కలుగుతుంది. ఇది లండన్ నగరం కంటే చాలా పెద్దది. లండన్ 1,569 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటే.. నెపిడా 7,054 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. అంత గొప్పగా నిర్మించిన రాజధానిలో అన్నిరకాల వసతులు కల్పించారు. విలాశవంతమైన హోటళ్ళు, షాపింగ్ మాల్స్, వైఫై సదుపాయాలు, భారీ భవంతులు, గోల్ఫ్ కోర్సులు, కేఫ్‌లు, 24x7 ఎలక్ట్రిసిటీ ఇలా ఎన్నో రకాల సదుపాయలు ఇక్కడ ఉన్నాయి. కానీ, వాటిని సద్వినియోగం చేసుకోడానికి జనాలు లేరు. 2016 లెక్కల ప్రకారం.. లండన్‌లో 8.63 మిలియన్ జనాభా నివసిస్తుంటే నెపిడాలో మాత్రం కేవలం 9,24,608 మంది మాత్రమే నివసిస్తున్నారు.
 
మయన్మార్‌ సైనిక పాలన ముగిసి, ప్రజాస్వామ్యం వచ్చింది. తొలిసారిగా ప్రజలు అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. సరిహద్దులు తెరుచుకోవడంతో మయన్మార్‌లో పర్యాటకుల తాడికి పెరిగింది. కానీ, నెపిడాలో పర్యటించే సాహసం ఎవరూ చేయలేదు. ఆగస్టు నెలలో మయన్మార్‌లోని పలు పర్యాటక ప్రాంతాల్లో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. కానీ, ఈ నగరంలో మాత్రం.. ఎవరూ అడుగుపెట్టరు. ఈ ప్రదేశంలో మొదట చెరుకు, వరి పంటలు ఉండేవి. వాటిని తొలగించి ఈ నగరాన్ని నిర్మించారు. లక్ష జనాభా కలిగిన పిన్మనా ప్రాంతానికి శివారులో ఈ నగరాన్ని నిర్మించారు. ఈ నగరంలో మొత్తం 8 టౌన్‌షిప్‌లు ఉన్నాయి. వాహనాలతో సందడిగా కనిపించాల్సిన హైవే మీద కనీసం ఒక్క వాహనం కూడా కనిపించదు. కేవలం గాలి మాత్రమే సుడులు తిరుగుతూ.. మనసులో ఒకరకమైన భయాన్ని ఏర్పరుస్తాయి. మనుషుల్లేని భూగ్రహంలో తిరుగుతున్నామా అనిపిస్తుంది. 
 
సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే నెపిడా ఇలా ఘోస్ట్ క్యాపిటల్‌గా మిగిలిపోయిందని విమర్శకుల వాదన. ఏదైనా నగరాన్నే రాజధానిగా చేసుకుని, దాని శివారు ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, నిధులు కూడా మిగిలేవని తెలుపుతున్నారు. అయితే, ఈ రాజధాని కేవలం భవిష్యత్తు కోసం నిర్మించిందేనని రానున్న పదేళ్లలో తప్పకుండా జనాభా పెరుగుతుందని పాలకవర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత నగరాల్లో రాజధాని నిర్మిస్తే.. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయని తెలుపుతున్నారు. ఏది ఏమైనా.. కొత్త రాజధానులు నిర్మించే దేశాలు లేదా రాష్ట్రాలకు దీని లోపం ఒక గుణపాఠం అవుతుంది. రానున్న రోజుల్లో ఈ రాజధాని నగరం తప్పకుండా జనాభాతో కళకల్లాడాలని ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: