ఓ మైనర్ బాలుడు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే... ఆ బాలుడు తన తల్లిదండ్రులకు తెలియకుండా ఖరీదైన బైక్ కొన్నాడు. దీంతో షికారుకు వెళ్తూ దాన్ని నిర్లక్ష్యంగా నడుపుతూ.. ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. ప్రమాదం అంశం వివాదాస్పదంగా మారడంతో అతడు బైక్ కొనుగోలు చేసిన విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. తమ కుమారుడు బైక్ కొనడమే కాకుండా, ఓ వ్యక్తి మరణానికి కారణమైన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. 


అతడి కి బైక్ విక్రయించిన షో రూమ్‌ నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. వివాదం ముదరడంతో ఇరుపక్షాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. హైదరాబాద్‌ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాచారం సమీపంలోని అన్నపూర్ణ కాలనీలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న ఓ బాలుడు (17) తన సోదరుడు (19) తో కలిసి లక్ష రూపాలయతో ఓ బైక్ కొన్నాడు. బేగంపేటలోని ఓ బైక్ షోరూంలో సెప్టెంబర్ 30 న ఈ వాహనాన్ని కొనుగోలు చేశాడు. హాస్టల్లో ఉంటున్న బాలుడు ఆ బైకును తన వద్దనే ఉంచుకున్నాడు.


సదరు బాలుడు ఇటీవల తన బైక్‌ నడుపుతూ ఘట్‌కేసర్‌ సమీపంలో ఒక వ్యక్తిని ఢీకొట్టి అతడి మృతికి కారణమయ్యాడు.ఇది సదరు బాలుడి కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. దీంతో అతడి తండ్రి కొంత మంది బంధువులు కలిసి శనివారం (డిసెంబర్ 28) బైక్ షోరూంకు వచ్చి గొడవకు దిగారు. తమ కుమారుడికి బైక్‌ ఎందుకు విక్రయించారని నిలదీశారు. 


దీంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఘర్షణ జరుగుతున్న సమాచారం అందుకొని అక్కడికి వెళ్లిన తమ పై కూడా బాలుడి బంధువులు దురుసుగా ప్రవర్తించారని కానిస్టేబుళ్లు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: