ఏపీలో రాజధాని అంశంపై సందేహాలు తలెత్తుతున్న వేళ సామాన్య జనంతో పాటు వ్యాపారులు కూడా గందరగోళానికి గురవుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. క్రెడాయ్ తెలంగాణ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంది. హైదరాబాద్‌కు దీటుగా అక్కడ స్థిరాస్తి వ్యాపారం కొనసాగింది. రూ. లక్షల్లో పలికిన భూముల ధరలు కోట్ల రూపాయలకు చేరాయి. తెలంగాణ నుంచి అమరావతి వైపు పరుగులు తీశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మొత్తం మారాయని అయన చెప్పుకొచ్చారు.
  
 తాజాగా ఏపీలో మూడు రాజధానుల అంశం పై తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకునేందుకు కారణం అవుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తదితరులు హైదరాబాద్ నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. 


ఇప్పుడు ఏపీలో ఎక్కడ రాజధాని ఏర్పాటవుతుందో అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో తెలియక వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. అమరావతి విషయంలో నెలకొన్న సందిగ్ధతతో స్థిరాస్తి వ్యాపారం మందగించింది. ఈ ప్రభావంతో హైదరాబాద్‌లో మరొకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశాలున్నాయి. ఐటీ ఉద్యోగులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు అని హరీశ్ అన్నారు. 


అన్ని రకాల రంగాల వారికీ హైదరాబాద్ అనుకూల నగరమని హరీశ్ రావు తెలిపారు. చెన్నైలో మంచినీటి సమస్య, బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య, ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో అధిక ధరల సమస్యలు ఉన్నాయని.. హైదరాబాద్‌లో మాత్రం ఇలాంటి తీవ్రమైన సమస్యలు లేవని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని బడా బిల్డర్లు తమ సామాజిక బాధ్యతగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్ రావు కోరారు

మరింత సమాచారం తెలుసుకోండి: