దేశచరిత్రలో కనీవినీ ఎరుగని చలి. 118 ఏళ్ల రికార్డులను తిరగరాస్తోంది. దేశరాజధాని సహా ఉత్తరాదిని గజగజా వణికిస్తోంది. 1901 సంవత్సరం తర్వాత అత్యంత చలి నమోదైన రోజుగా డిసెంబర్ 30ని వాతావరణశాఖ ప్రకటించింది. ఇంతకూ ఇంతగా చలి విజృంభించడానికి కారణమేంటో తెలుసా.. ?  

 

ఉత్తరాది వణికిపోతోంది. విపరీతంగా కురుస్తున్న మంచు, చలిగాలుల ధాటికి తల్లడిల్లుతోంది. నిన్న ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత 9.4 డిగ్రీలుగా నమోదైంది. 1901 సంవత్సరం తర్వాత అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో రాజధాని వాసులు.. చలి మంటలు, రగ్గులు, స్వెట్టర్లతో కాలం గడుపుతున్నారు. ఓ సూర్యభగవానుడా కరుణించు అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము, కశ్మీర్ చలికి వణికిపోతున్నాయి.

 

ఏటా చలి ఉన్నా.. ఈ ఏడాది ఎందుకింత చలి పెరిగింది. దీనికి చాలా కారణాలున్నాయంటున్నారు వాతావరణశాఖ పరిశోధకులు. ఏటా డిసెంబర్ రెండోవారం నుంచి జనవరి మొదటి వారం వరకూ 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గడం సాధారణంగా వస్తోంది. కానీ ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీనికి వాతావరణ మార్పులు కొంతవరకూ కారణమంటున్నారు నిపుణులు.

 

పశ్చిమవైపు నుంచి చలిగాలులు రావడం, ఫలితంగా ఈశాన్య భారతంలో వర్షాలు కురవడం సర్వసాధారణం. ఈ గాలులు మెడిటేరియన్ సీ నుంచి తేమను తీసుకు రావడంతో కొంత చల్లదనం పెరుగుతోంది. అయితే ప్రస్తుతం కోల్డ్ వేవ్ కండిషన్స్‌కు నార్తర్న్ ఆఫ్గనిస్తాన్, తజ్బెకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వైపు నుంచి జమ్ము,కశ్మీర్ మీదుగా గాలులు రావడం కారణంగా తెలుస్తోంది. ఫలితంగా సాధారణం కన్నా 1 నుంచి 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

 

పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ వరకూ విస్తరించిన దట్టమైన మేఘాలు సైతం.. చలి విజృంబించడానికి ఓ కారణంగా చెబుతున్నారు. ఇవి లోలెవల్లో ఏర్పడటంతో చలి తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉంటోంది. దీని ప్రభావంతో ఉత్తరాది గజగజా వణుకుతోందని చెబుతున్నారు. 300 నుంచి 400 మీటర్ల ఎత్తులు దట్టంగా ఏర్పడుతున్న మేఘాలు.. సూర్యరశ్మికి బ్లాంకెట్ లా అడ్డుపడడంతో చల్లదనం క్రమంగా పెరుగుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: