బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆయన కేబినెట్‌ లోని మంత్రుల ఆస్తుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఆయన ఆస్తుల్లో పెద్దగా మార్పు ఏమీ లేదు. కొత్తగా రెండు ఆవులు, ఒక దూడ మాత్రమే అదనంగా ఉన్నట్లు తెలిపారు. గతేడాది ఆయన వద్ద రూ.42వేల నగదు, ఒక ఆవుల షెడ్డు, ఎనిమిది ఆవులు, ఆరు ఆవు దూడలు ఉన్నట్టు ప్రకటించారు. 


ఈ ఏడాది రూ.38,039 నగదుతో పాటు పది ఆవులు, ఏడు దూడలు ఉన్నట్టు ప్రకటించారు. ఇవి కాకుండా రూ.16లక్షల విలువచేసే చరాస్తులు, రూ.40లక్షలు విలువచేసే స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు. అలాగే ఢిల్లీలోని ద్వారకాలో ఒక ఫ్లాట్ కూడా ఉన్నట్టు ప్రకటించారు. 2010 నుంచి నితీశ్ సహా తన కేబినెట్ మంత్రుల ఆస్తులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే పరంపరలో ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు.


నితీశ్ కంటే ఆయన కుమారుడు,కేబినెట్ మంత్రులకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. నితీశ్ కుమారుడికి రూ.1.39కోట్ల విలువచేసే చరాస్తులు,1.48కోట్లు విలువచేసే స్థిరాస్తులు ఉన్నట్టు ప్రకటించారు. అలాగే తల్లి ద్వారా వారసత్వంగా సంక్రమించిన స్థిరాస్తులు ఉన్నట్టు చెప్పారు. ఇక ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ తన ఆస్తుల విలువ రూ.1.26కోట్లుగా ప్రకటించారు. తన భార్య ఆస్తులు రూ.1.65కోట్లుగా ప్రకటించారు. అలాగే తన వద్ద రూ.81.54లక్షల నగదు,ప్రొఫెసర్ అయిన తన భార్య వద్ద రూ.97.18లక్షల నగదు ఉన్నట్టు తెలిపారు. 


మరో మంత్రి సురేష్ శర్మ తన ఆస్తుల విలువ రూ.9కోట్లుగా ప్రకటించారు. నితీశ్ కేబినెట్‌లో అందరికంటే తక్కువ ఆస్తులు ఉన్న మంత్రిగా నీరజ్ కుమార్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.35.87లక్షలు కాగా,నగదు రూ.27లక్షలుగా ప్రకటించారు.గతేడాది కొత్తగా కేబినెట్‌లో చేరిన మంత్రి సంజయ్ ఝా తన ఆస్తుల విలువ రూ.22కోట్లుగా ప్రకటించారు. ఇవన్నీ తన భార్య పేరు మీద,తన పేరు మీద సమిష్టిగా ఉన్నట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: