ఏపీ అభివృద్ధి, రాజధాని అంశానికి సంబంధించి రూపొందించిన తమ నివేదికను సీఎం జగన్ కు బోస్టన్ కమిటీ ప్రతినిధులు అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని వారు కలిశారు. ఈ నివేదికలో మూడు రాజధానులు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సిఫారసులు ఉన్నాయి. ఈ నివేదికలోని వివరాలను జగన్ కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ప్రతినిధులు వివరించారు. కాగా.. రాజధానిపై ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 6న రెండు నివేదికలనూ హైపవర్‌ కమిటీ పరిశీలించనుంది. అనంతరం 8న రెండు నివేదికలపై కేబినెట్‌ చర్చించనున్నది.


బీసీజీ నివేదికలోని ముఖ్యాంశాలను ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీసీజీ బృందం 13 జిల్లాలున్న రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించింది. ఈ ప్రాంతాల్లో ఏయే వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అభివృద్ధికి ఆటంకాలేంటనే విషయాన్ని పరిశీలించారు. ఈ ఆరు ప్రాంతాల్లో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే విషయాన్ని సూచించింది. ఇందుకోసం ఎకానమీ, మౌలిక వసతులు, ఇండస్ట్రీ, వ్యవసాయం, సేవారంగం, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే ఆరు అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నారు.


ఎకానమీలో ఏపీ ఎనిమిదో పెద్ద రాష్ట్రంగా ఉంది. కానీ దక్షిణాదిలో ఏపీలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉంది. ఈ అంశంలో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. వ్యవసాయంలో క్రిష్ణా, గోదావరి బేసిన్లో మాత్రమే 50 శాతం ఉత్పత్తి ఉంది. రాష్ట్ర అక్షరాస్యత జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.


హైపవర్‌ కమిటీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సారథ్యాన ఈ నెల 6వ తేదీన తొలిసారిగా సమావేశం కానుంది. ఈ కమిటీ 3 వారాల్లో తన తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత హైపవర్‌ కమిటీ తన నివేదికను సీఎంకు సమర్పించనుందని సమాచారం. అనంతరం దానిపై కేబినెట్‌లో చర్చించి.. శాసనసభ సమావేశం ఏర్పాటుచేసి.. అక్కడ ఆమోదింపజేసుకుంటారని అంటున్నారు. ఇంకోవైపు.. 8వ తేదీన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: