ఇటీవ‌ల 81 స్థానాల జార్ఖండ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి 47 స్థానాల్లో విజయం సాధించి.. బీజేపీని మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. బీజేపీ 25, ఇతరులు 9 స్థానాల్లో గెలుపొందారు. అనంత‌రం గవర్నర్ ద్రౌపతి ముర్ము సమక్షంలో జార్ఖండ్ సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించిన ఇంకా ప‌దిరోజులు కూడా కాక‌ముందే ఈ యువ‌నేత సీఎంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

 

ముఖ్య‌మంత్రి పీఠం ఇటీవ‌లే అధిరోహించిన నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప‌లువురు వ‌చ్చిన సీఎంను క‌లిసే మ‌ర్యాద ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఓ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చేవారు పుష్ఫ‌గుచ్ఛాలు తీసుకు రావ‌ద్ద‌ని ఆర్డ‌ర్ వేశారు. దానికి బ‌దులుగా పుస్త‌కాలు గిఫ్ట్‌గా ఇవ్వాల‌న్నారు. ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చిందో కూడా ఆయ‌న వెల్ల‌డించారు. బొకేలు చాలా ఖ‌రీదైన‌వి ఉంటాయ‌ని, వాటికి బ‌దులుగా పుస్త‌కాల‌ను ఇస్తే బాగుంటుంద‌ని సీఎం సోరేన్ తెలిపారు. ఆ పుస్త‌కాల‌తో లైబ్ర‌రీ త‌యారు చేయ‌వ‌చ్చు అన్నారు. దాని వల్ల ప్ర‌జ‌లు లాభ‌ప‌డుతార‌ని సీఎం తెలిపారు. కాగా, యువ‌నేత నిర్ణ‌యంపై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.  

 


కాగా, జార్ఖండ్ ఎన్నిక‌ల్లో సీఎం రఘబర్‌దాస్‌తోపాటు ఆయన కేబినెట్‌లో ఉన్న ఆరుగురు మంత్రులు, స్పీకర్‌ ఓటమి పాలయ్యారు. జేఎంఎం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీఎం అభ్యర్థి హేమంత్‌ సోరెన్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఫలితాల అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ గెలుపు విష‌యంలో తోడ్ప‌డ్డ‌వారికి ఆయ‌న కంగ్రాట్స్ చెప్పారు. త‌న‌పై విశ్వాసం ఉంచిన లాలూ, సోనియా, రాహుల్‌, ప్రియాంకాల‌కు హేమంత్ థ్యాంక్స్ చెప్పారు. తీర్పు ఇచ్చిన ప్ర‌జ‌లకు కూడా హేమంత్ థ్యాంక్స్ తెలిపారు. ఎవ‌రి ఆశ‌ల‌ను దెబ్బ‌తీయ‌మ‌ని హేమంత్ అన్నారు.  ఫ‌లితాలు అనుకూలంగా వ‌చ్చిన నేప‌థ్యంలో.. హేమంత్ త‌న నివాసంలో హుషారుగా సైకిల్ తొక్కుతూ క‌నిపించారు. ఈ సందర్భంగా రాంచీలోని తండ్రి శిబు సోరెన్ నివాసానికి వెళ్లిన హేమంత్ సోరెన్ ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

 

2013లో హేమంత్ సోరెన్ జార్ఖండ్ ఐదో ముఖ్యమంత్రిగా పని చేశారు. హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన వయసు 38 సంవత్సరాలు మాత్రమే. సుమారు సంవత్సర కాలం పాటు హేమంత్ సోరెన్ సీఎంగా సేవలందించారు. అంతలోనే 2014 ఎన్నికలు రావడం.. బీజేపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ - జేఎంఎం కూటమి ఆధిక్యం ద‌క్కించుకోవ‌డంతో సీఎం పదవిని మ‌ళ్లీ సోరెన్ చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: