పౌర‌స‌త్వ స‌వ‌రణ చ‌ట్టం ప్ర‌కారం పాక్‌, బంగ్లా, ఆఫ్గ‌న్ దేశాల్లో వివ‌క్ష‌కు గురైన ఆరు మ‌తాల‌కు చెందిన మైనార్టీల‌కు పౌర‌స‌త్వం ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. దీనిపై వివిధ ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇలా ఇప్పటికే సీఏఏ, ఎన్నార్సీల వ్యతిరేక నిరసనలతో దేశం మారుమోగుతుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేంద్ర‌మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్ల‌డించారు. మ‌య‌న్మార్‌కు చెందిన రోహింగ్యాలను త్వరలోనే భారత్‌ నుంచి బహిష్కరించనున్నామని కేంద్ర‌మంత్రి వెల్లడించారు. 


జ‌మ్మూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. కేంద్రం తదుపరి చర్య రోహింగ్యాలకు బహిష్కరించడమేనని అన్నారు.  జ‌మ్మూక‌శ్మీర్‌లో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌  తెలిపారు.  సీఏఏ చ‌ట్టం ప్ర‌కారం రోహింగ్యాల‌ను డిపోర్ట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కేంద్రపాలితప్రాంతమైన జమ్మూలోనూ సీఏఏ వర్తిస్తుందని అన్నారు. క‌శ్మీర్‌లో సుమారు 13వేల మంది విదేశీయులు ఉన్న‌ట్లు కేంద్ర‌మంత్రి చెప్పారు. దాంట్లో రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీయులు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. జ‌మ్మూ, సాంబా జిల్లాలో వీళ్లంతా సెటిల‌య్యారు. జమ్మూలోనూ రోహింగ్యాలు అధికసంఖ్యలో ఉన్నారని జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. వారిని గుర్తించేందుకు త్వరలోనే ఓ జాబితా తయారు చేసి, వేలిముద్రలూ సేకరిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌  తెలిపారు. 

 


పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘనిస్తాన్‌లలో రోహింగ్యాలు మైనారిటీ వర్గాలకు చెందినవారు కానందునే ఈ నిర్ణయం తీసుకోనున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్  ప్ర‌క‌టించారు. వారు మయన్మార్‌ నుంచి వచ్చినందున వారికి సీఏఏ వర్తిందనీ, కాబట్టి వారంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో సుమారు 14వేల మంది రోహింగ్యాలు చట్టప్రకారం నివసిస్తుండగా, 40వేల మంది అక్రమంగా జీవిస్తున్నట్టు అంచనా.  కేంద్ర‌మంత్రి ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలో రోహింగ్యాల్లో క‌ల‌వ‌రం మొద‌లైందని అంటున్నారు. కాగా, వారికి ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని కోరే వివిధ పార్టీలు, సంఘాల నేత‌లు ఈ ప్ర‌క‌ట‌న‌పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: