తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఫోక‌స్ అంతా ఇప్పుడు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పైనే ఉంది. తెంగాణ  రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్లపై గులాబీ జెండా ఎగుర‌వేయాల‌ని ఆ పార్టీ త‌ల‌పోస్తోంది. ఇందుకు త‌గిన క‌స‌ర‌త్తు చేస్తోంది. తాజాగా తెలంగాణ భవన్‌లో ఇవాళ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ త‌న‌దైన శైలిలో ఘాటు వ్యాఖ్య‌లు, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు...ఒకింత హెచ్చ‌రిక‌లు సైతం చేసిన‌ట్లు స‌మాచారం.

 

టీఆర్ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నగర మేయర్‌, కార్పోరేటర్లు పాల్గొన్నారు.  మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఇప్పటివరకు జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి, అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మనకు ఏ పార్టీ పోటీ కాదని సీఎం అన్నారు. కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోయింద‌ని ఎద్దేవా చేశారు. బీజేపీ తమకు రాష్ట్రంలో పట్టుందని సొంత డబ్బా కొట్టుకుంటుందని సీఎం ఎద్దేవా చేశారు.

 


టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున‌ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అందరూ.. అభ్యర్థి విజయానికే పాటుపడాలని కేసీఆర్ ఆర్డ‌ర్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని కార్యకర్తలతో, పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ప్రతి సర్వే.. టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌లో తమ హవా కొనసాగిస్తుందని తెలిపాయన్నారు. అయితే, కొంద‌రు మంత్రుల‌ను కేసీఆర్ హెచ్చరించిన‌ట్లు స‌మాచారం. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌ని...అక్క‌డ ఓడిపోతే..మంత్రి ప‌ద‌వులు ఊడుతాయ‌ని వార్నింగ్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: