శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర ఆలయాన్ని ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన కాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణి బొత్స ఝాన్సీతో కలిసి ఆయన రాహు, కేతు పూజలు జరిపించుకున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజారులతో కలిసి పూజలను ఘనంగా.. శాస్త్రోక్తంగా నిర్వహించారు.


శ్రీ కాళహస్తి ఆలయానికి విచ్చేసిన మంత్రి బొత్సకు, కుటుంబ సబ్యులకు  స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రికి స్వాగతం చెప్పిన మధు సూదన్ రెడ్డి అనంతరం.. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. తర్వాత తీర్థ ప్రసాదాలను కురుమ సభ్యులకు అందజేశారు. అయితే ఏపీ మంత్రి బొత్స శ్రీకాళహస్తి లో రాహు, కేతు పూజలు చేయడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.


బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయనను వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. ఇటీవల అమరావతి పై ప్రభుత్వం పునరాలోచిస్తోందంటూ మంత్రి చేసిన ప్రకటన తీవ్ర దుమారానికి కారణం అయింది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ.. బొత్స పై తీవ్ర విమర్శలు వచ్చాయి.


ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు భగ్గుమన్నారు. రైతులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం రాజధాని అధ్యయనానికి నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదిక.. నిన్న సమర్పించిన బోస్టన్ నివేదిక వివాదానికి ఇంకా ఆజ్యం పోశాయి. రాజధాని పరిణామాలతో మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ టార్గెట్ గా అయ్యారు. ఈయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యం లోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాహు, కేతు పూజలు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: