తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ఉన్నత పోలీస్ విభాగంగా రూపొందిందని... హోం మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. శనివారం సాయంత్రం పీపుల్స్  ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా ఏర్పాటు చేసిన 4 పోలీస్ బ్యాండ్ బృందాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం పోలీసు విభాగం గురించి మాట్లాడారు.

 

పౌరులు, పోలీసుల మధ్య సుహృద్భావ వాతావరణం, సత్సంబంధాలు నెలకొల్పడానికి సాంస్కృతిక వారధిగా పోలీస్ బ్యాండ్ బృందాలు కీలక పాత్ర వహిస్తాయని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ శాఖ లోని బ్యాండ్ బృందాల ద్వారా ప్రదర్శనలను ఏర్పాటు చేసి పౌరులకు వినోద కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. బ్యాండ్ విభాగాలు ప్రజా సంబంధాలు నెలకొల్పడంలో ముఖ్య భూమిక వహిస్తాయన్నారు. అతి తక్కువ సమయంలో 4 కొత్త బ్యాండ్ బృందాలను ఏర్పాటు చేసి ఉత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని డీజీపీ చెప్పారు. స్పెషల్ పోలీస్ బెటాలియన్ వీటిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

 

ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడించారు. ఇందులో భాగంగా పోలీస్ శాఖ ఆధునీకరణకు, మెరుగైన శిక్షణకు అధిక నిధులు కేటాయించారని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో కుల, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు పండుగ లను కలిసికట్టుగా, ప్రశాంతంగా నిర్వహించుకుంటారని తెలిపారు. తద్వారా భాగ్యనగరం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. దేశంలోనే ఉత్తమ పోలీస్ వ్యవస్థగా తెలంగాణ పోలీసు వ్యవస్థ ఎదిగిందని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హోం శాఖ కార్యదర్శి రవి గుప్త, బెటాలియన్ డీజీ అభిలాష్ బిస్త్, అడిషనల్ డీజీలు జితేందర్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ మెహ్రా, సైబరాబాదు కమిషనర్ వీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: