తమిళనాడు మాజీ స్పీకర్‌, అన్నాడీఎంకే సీనియర్‌ నేత పీహెచ్‌ పాండ్యన్‌(74) శనివారం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండియన్‌ తమిళనాడులోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పాండియన్‌ మృతిపట్ల అన్నాడీఎంకే నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

 

న్యాయవాది, వక్త, రాజకీయ వ్యూహకర్తగా పాండ్య‌న్‌ పేరుగాంచారు. ఎమ్మెల్యే, ఎంపీగాను ఎన్నికైన ఆయన 1980-84 వరకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, 1985-89 వరకు స్పీకర్‌గా ఉన్నారు. ఎంజీ రామచంద్రన్‌ సీఎంగా ఉన్న సమయంలో 1985 నుంచి 1987 మధ్యకాలంలో అసెంబ్లీ స్పీకర్‌గా పాండియన్‌ కొనసాగారు. 1999 నుంచి 2004 మధ్య కాలంలో తిరునెల్వేలి ఎంపీగా సేవలందించారు పాండియన్‌. 1987లో ఓ తమిళ మ్యాగజైన్‌పై విచారణ సందర్భంగా అసెంబ్లీకి ఆకాశమంత ఎత్తు అధికారాలుంటాయని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్య తమిళనాట అందరి దృష్టిని ఆకర్షించింది. జయలలిత మరణం వెనుక శశికళ ప్రమేయం ఉన్నదని అనుమానం వ్యక్తం చేస్తూ పార్టీలో తొలిసారి ఆయన గళమెత్తారు.  

 


కాగా, జయలలిత మృతిపై విచారణ కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ముగస్వామి కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే.  విచారణ జరుపుతున్న కమిషన్‌కు శ‌శిక‌ళ‌ కీలక వివరాలు అందించారు. ఆ రోజు జయలలితను ఇంటి నుంచి ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందన్న విషయాలను ఆమె వెల్లడించారు. ``ఆ రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత బాత్‌రూమ్‌లోనే తనకు ఏదో సమస్యగా అనిపిస్తున్నదని జయలలిత చెప్పారు. దీంతో ఆమెను నేనే తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టాను. అక్కడే జయలలిత స్పృహ కోల్పోయారు. దీంతో అపోలో ఆసుపత్రి వైద్యులను ఇంటికి పిలిపించాను. స్ట్రెచర్‌పై ఆమెను అలాగే అంబులెన్స్‌లోకి తీసుకెళ్లాం. దారిలో ఆమెకు మెలకువ వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అని అడగటంతో ఆసుపత్రికి అని చెప్పాను. ఆమె వద్దని వారించింది. అయినా ఆసుపత్రికి వెళ్తేనే మంచిదని చెప్పి ఆమెను తీసుకెళ్లాను`` అని శశికళ కమిషన్‌కు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: