వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆల‌యాలు ముస్తాబు అయ్యాయి. క‌లియుగ దైవం వెంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకునేందుకు అనేక‌మంది భ‌క్తులు ఇప్ప‌టికే తిరుమ‌ల చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.  హైకోర్టు సూచనలతో సమావేశమైన టీటీడీ పాలకమండలిలో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు ఎన్నిరోజులు తెరిచి ఉంచాలనే అంశం, ఉచిత లడ్డూ ప్రసాదంపైనా స‌మ‌గ్రంగా చ‌ర్చించింది. ఈ స‌మావేశం అనంత‌రం టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. గతంలో మాదిరిగా రెండు రోజులే దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్ల‌డించారు. ఈమేరకు తుది నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. కాగా, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తిరుమల చేరుకున్నారు. 

 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో టీటీడీ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. 'గతంలో మాదిరిగానే రెండు రోజులే ఉత్తర ద్వార దర్శనం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ఇస్తాం. జనవరి 20 నుంచి ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ అందజేస్తాం. రూ.50కు అదనపు లడ్డూలను కౌంటర్లలో అందుబాటులో ఉంచుతాం. కోర్టు ఆదేశాలతోనే పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించాం. వైకుంఠ ద్వారాలు పదిరోజులు తెరిచే అంశంపై కమిటీని నియమిస్తున్నామని' వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 


కుటుంబ స‌మేతంగా, కేటీఆర్ తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, మధుసూధన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం కుటుంబ సమేతంగా కేటీఆర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: