నారా భువనేశ్వరి తొందరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇపుడీ అంశంపైనే తెలుగుదేశంపార్టీలో చర్చ జరుగుతోంది.  అసలు మొన్నటి ఎన్నికల్లోనే భువనేశ్వరి పోటి చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో ఇదే విషయమై ఆమెను అడిగితే తాను రాజకీయాల్లోకి  వచ్చేది లేదని స్పష్టంగా చెప్పేశారు. కానీ మారిన రాజకీయ పరిస్ధితుల్లో  తొందరలోనే రాజకీయాల్లోకి  రాబోతున్నట్లు ప్రచారమైతే జరుగుతోంది.

 

ఇందుకు ఉదాహరణగా ఈమధ్యనే రాజధాని అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్న విషయాన్ని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా  ఉద్యమం చేస్తున్న రైతులు, మహళలకు మద్దతుగా దీక్షలో పాల్గొనటం, ఉద్యమ ఖర్చుల క్రింద తన చేతి గాజులను విరాళంగా ఇవ్వటమంతా భర్త చంద్రబాబునాయుడు వ్యూహం ప్రకారమే జరిగిందంటున్నారు.

 

మొన్నటి ఎన్నికలకు ముందు నుండి కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో భువనేశ్వరి పాల్గొన్న విషయం అందరికీ గుర్తుంటే ఉంటుంది. అలాగే కుప్పం నియోజకవర్గంలోని నేతలు, పార్టీ శ్రేణులతో చంద్రబాబు తరపున రెగ్యులర్ గా ఆమె టచ్ లో ఉంటోంది. ఎన్నికల సమయంలో అయితే ప్రతిరోజు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తు పార్టీ పరిస్ధితిపై దిశా నిర్దేశం చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది.

 

సరే ప్రస్తుత విషయానికి వస్తే తెలుగుదేశంపార్టీ పరిస్ధితి అయితే చాలా ఇబ్బందిగా మారిందన్నది వాస్తవం.  అందుకనే  ఎన్టీయార్ వారసురాలిగా కృష్ణా జిల్లా నుండే రాజకీయాల్లోకి ప్రవేశించాలని భువనేశ్వరి అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎలాగూ  గన్నవరం నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది.  ఎంఎల్ఏ వల్లభనేని వంశీ తొందరలోనే రాజీనామా చేయబోతున్నారట. కాబట్టి ఆ సీటులో టిడిపి అభ్యర్ధిగా భువనేశ్వరి పోటి చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదనే ప్రచారం ఊపంకుంటోంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: