అనంతపురం టీడీపీ మాజీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు ముఖం మీద కుండ బద్దలు కొడతారని పేరున్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల వైఖరి సరిగ్గా లేదని తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. స్థానిక నాయకులతో జేసీ పిచ్చపాటి మాట్లాడుతున్న వీడియో వైరలైంది. ఆయన నాయకులతో మాట్లాడుతూ.. ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితులు ఏమీ మారవని.. ప్రాంతీయ పార్టీలు కక్షసాధింపులకు పోతున్నాయన్నారు.


తాను ఏ ఒక్క ప్రాంతీయ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం లేదన్న జేసీ.. అన్ని పార్టీలు అలానే ఉన్నాయన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యాలు, అభివృద్ధిపై ఆయన పెదవి విరిచారు. సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా ఇచ్చే విధానాలను ఆయన తప్పుబట్టారు. ఆరోగ్య శ్రీ పథకంపై మాత్రం ప్రశంసలు కురిపించారు. ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని.. మంచి ఎవరు చేసినా అభినందించాల్సిందేనన్నారు. అంతకుమించిన పథకమేదీ జగన్ ప్రవేశపెట్టలేదన్నారు.


టీడీపీలో చంద్రబాబును అడిగే నా* లేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ని అడిగేవాడు లేడని.. డీఎంకే స్టాలిన్‌ ను ఉద్దేశించి మద్రాస్‌ లో ఆయనను అడిగేవాడు లేడన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అధినేతలకు ఎదురు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. క్రమంగా ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం తగ్గిపోతోందన్న జేసీ.. జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.


ప్రాంతీయ పార్టీలను దునుమాడిన జేసీ.. రెడ్డి కులస్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా రెడ్డి గాళ్లకు మెదడు మోకాళ్లలో ఉంటుందంటూ సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మా రెడ్డి అంటూనే జేసీ సీఎంను టార్గెట్ చేస్తూ వస్తున్న జేసీ.. మరోసారి మెదడు మోకాళ్లో ఉందంటూ విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: