ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కండరాల క్షీణత మరియు మంచానికి పరిమితమై ఉన్నవారికి లేదా చక్రాల కుర్చీ ద్వారా జీవనాన్ని సాగిస్తున్న వారికి నెలకు 5 వేల రూపాయల పింఛన్ ఇచ్చేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ఏపీ ప్రభుత్వం వైయస్సార్ ఫింఛను కానుక పథకంలో భాగంగా పక్షవాతం మరియు కండరాల క్షీణత కింద దివ్యాంగుల విభాగంలో 78,671 మందికి పింఛను పొందటానికి అర్హత ఉన్నట్టు గుర్తించింది. 
 
ఏపీ సీఎం జగన్ ఏవైనా ప్రమాదాల కారణంగా మరియు తీవ్రమైన కండరాల క్షీణత, పక్షవాతం వలన చక్రాల కుర్చీకి పరిమితమై ఉన్నవారికి నెలకు 5 వేల రూపాయల పెన్షన్ అందించనున్నట్టు ప్రకటన చేశారు. వైద్య ఆరోగ్య శాఖ 74,490 మంది మంచానికే పరిమితమై ఉన్నట్టు గుర్తించగా 4,181 మంది పక్షవాతంతో మంచానికే పరిమితమైనట్టు గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం వైయస్సార్ పెన్షన్ కానుకకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
గతంలో ఉన్న నిబంధనలకు సవరించి ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను తయారు చేసింది. పట్టణ ప్రాంతాలలో 12 వేల రూపాయలు, గ్రామీణ ప్రాంతాలలో 10 వేల రూపాయలలోపు నెలసరి ఆదాయం ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉండరాదు. 300 యూనిట్లకు విద్యుత్ వినియోగం మించకుండా ఉండటంతో పాటు కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించే సభ్యులు ఎవరూ ఉండకూడదు. 
 
ఇప్పటివరకు వైయస్సార్ పెన్షన్ కానుకలో భాగంగా 60 సంవత్సరాలకు పై బడిన నిరుపేదలు, 18 సంవత్సరాల వయస్సు దాటిన వితంతువులు, 40 శాతం పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, 50 సంవత్సరాల వయస్సు పై బడిన చేనేతలు మరియు గీత కార్మికులు, ప్రతి నెలా డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు, 18 సంవత్సరాల వయస్సు పై బడిన ట్రాన్స్ జెండర్లు, 30 సంవత్సరాల వయస్సు ఉండి వివాహం కాని వారు, 35 సంవత్సరాల వయస్సు పై బడి విడిపోయిన మహిళలు, మొదలైనవారు ఉండగా ఇకనుండి కండరాల క్షీణత మరియు చక్రాల కుర్చీకి పరిమితమై ఉన్నవారికి పెన్షన్ అందనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: