ప్రకృతి సంపద మధ్య కల్మషాలకూ, కల్తీలకూ, కాలుష్యాలకు దూరంగా స్వచ్ఛతకు దగ్గరగా జీవనం సాగించే వన పుత్రులు కన్నెర్ర చేశారు. తమ హక్కుల కోసం గళమిప్పారు. ఎన్నడూ లేని విధంగా తమ తమ డిమాండ్ల సాధన కోసం బంద్ కు పిలుపునిచ్చారు. దీనితో గిరిజన ప్రాంతం స్తంభించిపోయింది.  బంద్ సందర్భంగా అరకులోయలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హోటల్లు, లాడ్జిలు, సినిమా హాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఏజెన్సీలో జేఏసీ పిలుపు..
బంద్‌కు గిరిజన జేఏసీతో పాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ఏజెన్సీలో 48 గంటల బంద్‌కు గిరిజన జేఏసీ పిలుపు ఇచ్చింది. గిరిజన చట్టాల అమలు, గిరిజన హక్కుల పరిరక్షణ, 1/70 యాక్ట్ చట్టం పట్టిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రెండు రోజుల (సోమ, మంగళవారం) బందుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని స్కూల్స్‌కు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. గిరిజన బంద్ నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అలాగే 8వ తేదీన సకలజనుల సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడంతో వరుసగా మూడు రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో బంద్ జరగనుంది. 


మూడు రోజుల బంద్‌..
మూడు రోజుల బంద్‌లో బస్సులు, వాహనాలు తిరిగేందుకు అనుమతించబోమని గిరిజన జేఏసీ నాయకులు తెలిపారు. గత రెండు నెలలుగా పర్యాటకులతో, స్థానికులతో ఎంతో సందడిగా కనిపించిన అరకులోయ ఒక్కసారిగా బోసిపోయింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖపట్నం సందర్శనకు వచ్చే టూరిస్టులెవరైనా అరకులోయను సందర్శించకుండా వెళ్లరు. నగర పర్యటన ముగించుకున్న తరువాత హిల్ స్టేషన్ కు పయనమయ్యేందుకు అధికశాతం టూరిస్టులు ఆసక్తి చూపుతారు. విశాఖపట్నం నగరానికి 114 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అరకులోయ హిల్ స్టేషన్ ఉంటుంది. పర్వత శ్రేణుల నడుమ ఒదిగి ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు ఆలవాలం. అరకులోయ కేవలం పర్యాటక కేంద్రంగానే కాదు.. లొకేషన్ల పరంగా సినిమా షూటింగ్ లకు కూడా గమ్యస్థానంగా నిలుస్తుంది బంద్ విషయం తెలియక చాలామంది పర్యాటకులు అరకులోయలో చిక్కుకుపోయారు. బస్సులు తిరగకపోవడంతో తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: