సాధారణంగా మసీదు డోమ్‌పై ఆకుపచ్చ జెండాను ఎగురవేస్తుంటారు. దానికి బదులుగా ఎర్ర జెండా ఎగురవేస్తే తీవ్ర ప్రతీకారం లేదా యుద్ధానికి చిహ్నంగా భావిస్తారు. షియా ముస్లింల సంప్రదాయం ప్రకారం ఈ జెండా ఒక వ్యక్తిని అన్యాయంగా చంపారనడానికి, దానికి ప్రతీకారం తప్పదని హెచ్చరించడానికి ప్రతీకగా వాడుతారు. పగ తీర్చుకున్న తర్వాతే ఆ జెండాను అవనతం చేస్తారు. ఖుద్స్‌ ఫోర్స్‌ టాప్‌ కమాండర్‌ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరికలు పంపింది. అమెరికాతో యుద్ధానికి ఇరాన్‌ సై అని జెండాతో సూచ‌న‌లు ఇచ్చింది.

 

ఇరాన్‌లోని చారిత్రక, పవిత్ర పట్టణమైన ఖోమ్‌లోని పురాతన ‘జంకారా మసీదు’పై శనివారం ఎర్ర జెండాను ఎగురవేసింది. తద్వారా త్వరలోనే యుద్ధం రాబోతుందని సంకేతం ఇచ్చింది. ఇలా ఆధునిక చరిత్రలో తొలిసారిగా జ‌రిగింద‌ని పేర్కొంటున్నారు. పవిత్రమైన జంకారా మసీదు డోమ్‌పై చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎర్రజెండా ఎగిరిందని ఇరాన్‌ మీడియా తెలిపింది. చరిత్రను పరిశీలిస్తే దాదాపు 1,350 ఏళ్ల‌ కిందట కర్బాలాలోని చారిత్రక ఇమామ్‌ హుస్సేన్‌ మసీదుపై ఎర్రజెండాను ఎగురవేశారు. క్రీ.శ 680లో జరిగిన కర్బాలా యుద్ధంలో మహ్మద్‌ ప్రవక్త మనుమడైన ఇమామ్‌ హుస్సేన్‌ హతమయ్యాడు. దీంతో మసీదు డోమ్‌పై ఎర్రజెండా ఎగురవేశారు. ప్రతీకారం ఇప్పటివరకు తీరలేదు. దీంతో ఆ జెండాను ఇప్పటికీ అవనతం చేయలేదు. తాజాగా మ‌ళ్లీ జెండా ఎగుర‌వేశారు. దీని బట్టి అమెరికాతో యుద్ధానికి ఇరాన్‌ సిద్ధమవుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

 

కాగా, అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిణామాలు ప్రమాదకర మలుపు తీసుకున్నాయని, దీనిపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపింది. ఆదివారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జావెద్‌ జారిఫ్‌కు ఫోన్‌ చేశారు. అనంతరం జైశంకర్‌ ట్వీట్‌ చేస్తూ ‘ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జావెద్‌ జారిఫ్‌తో ఇప్పుడే మాట్లాడాను. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాను. అక్కడ పరిణామాలు ప్రమాదకర మలుపు తీసుకున్నాయని, దీనిపై భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతున్నదని ఆయన దృష్టికి తీసుకెళ్లాను. మళ్లీ ఓ సారి మాట్లాడుకోవాలని ఇరువురం నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: