జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో దుండగుల దాడి ఘ‌ట‌న క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై విప‌క్షాలు మండిప‌డుతున్న త‌రుణంలో అధికార-ప్ర‌తిప‌క్షాలు స్పందిస్తున్నాయి.జేఎన్‌యూ ప్రొఫెసర్లు, విద్యార్థులపై జరిగిన దాడి అత్యంత ఖండించదగినది, సిగ్గుచేటు అని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పందించారు. జేఎన్‌యూలో చోటు చేసుకున్న హింసపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్రానికి మాయావతి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని ఆమె కోరారు. 

 

అయితే,  విప‌క్షాలు విరుచుకుప‌డుతున్న త‌రుణంలో..కేంద్రం సైతం స్పందిస్తోంది. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ స్పందిస్తూ  జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసను ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఆప్‌ నాయకులతో పాటు మరికొన్ని శక్తులు కలిసి దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో హింసాత్మక వాతావరణం సృష్టించాలని కోరుకుంటున్నారని జవదేకర్‌ తెలిపారు.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర‌మంత్రి డిమాండ్ చేశారు. కాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ....విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చకూడదన్నారు. 


విద్యార్థులను రాజకీయ బంటులుగా ఉపయోగించకూడదని స్మృతి ఇరానీ అన్నారు. జేఎన్‌యూలో చోటు చేసుకున్న పరిణామాలపై దర్యాప్తు ప్రారంభమైందని, దర్యాప్తు జరుగుతున్న సమయంలో దానిపై మాట్లాడడం సరికాదన్నారు. అయితే, సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్ త‌న‌దైన శైలిలో కామెంట్లు చేశారు. యూనివర్సిటీని దౌర్జన్యాలకు, పోకిరీలకు అడ్డాగా మార్చారని ఆయన ఆరోపించారు. వామపక్ష విద్యార్థులు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ పరువు తీస్తున్నారని అన్నారు. 

 

ఇదిలాఉండ‌గా, ఈ దాడులకు బాధ్యత వహిస్తూ  యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఎం. జగదీష్‌ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని జేఎన్‌యూ స్టూడెంట్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. వీసీ జగదీష్‌ కుమార్ ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ జేఎన్‌యూ విద్యార్థులకు రక్షణ కల్పిస్తామన్నారు.  విద్యార్థులెవరూ ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దని చెప్పారు. యూనివర్సిటీలో శాంతియుత వాతావరణానికి విద్యార్థులు సహకరించాలని వీసీ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. శీతాకాల సెమిస్టర్‌ పరీక్షలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శీతాకాల సెమిస్టర్‌ పరీక్షలకు ఇబ్బందులు కలిగించేందుకు యూనివర్సిటీ సర్వర్లను కొందరు డ్యామేజ్‌ చేశారని వీసీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: