షేర్ మార్కెట్ ఎంత ఆక‌ర్ష‌ణీయ‌మైన‌దో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌ష్ట‌ప‌డ‌క్క‌ర్లేకుండా డ‌బ్బు ఎలా సంపాదించ‌గ‌ల‌మో....అంతే సుల‌భంగా డ‌బ్బు పోగొట్టుకోవ‌డం కూడా ఇక్క‌డ సాధ్య‌మే. అయితే, తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జాగ్ర‌త్త అవ‌స‌రం అంటున్నారు నిపుణులు. ఇరాన్‌ కమాండర్‌ సులేమానీను అమెరికా భద్రతదళాలు మట్టుబెట్టడంతో తీవ్ర ఒత్తిడికి గురైన అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు ఈవారంలోనూ మరింత పతనమయ్యే అవకాశాలున్నాయి. అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో గ్లోబల్‌ మార్కెట్లో కూడ్రాయిల్‌ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చమురు వినిమయంలో 80 శాతం ఇతర దేశాలపై ఆధారపడుతున్న భారత్‌పై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు మదుపరుల్లో నెలకొనడంతో అమ్మకాలకు మొగ్గుచూపనున్నట్లు మోతీలాల్‌ ఒశ్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేంకా తెలిపారు. 

 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా ఈ వారంలోనే విడుదలకానుండటం, వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌ కూడా కీలక అంశాలు కానున్నాయి. ఈ వారంలోనే సేవల రంగానికి సంబంధించిన పీఎంఐ డాటా, పారిశ్రామిక వృద్ధి గణాంకాలు ప్రకటించనున్నది కేంద్ర ప్రభుత్వం. చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న స్టాక్‌ మార్కెట్లకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నియంత్రించనున్నట్లు జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. ఈ శుక్రవారం దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ తన ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నది. గత శుక్రవారం బ్రెంట్‌ క్రూడాయిల్‌ 4.4 శాతం ఎగిసి 69.16 డాలర్లకు చేరుకున్నది. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 42 పైసలు పతనం చెంది నెలన్నర కనిష్ఠ స్థాయి 71.80కి పడిపోయింది.ఇదే స‌మ‌యంలో ఇంకో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకోనుంది.

 


వరుసగా ఆరు నెలలుగా దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నూతన సంవత్సరంలో వెనక్కి తగ్గారు. ఈ ఏడాది తొలి మూడు సెషన్లలోనే ఏకంగా రూ.2,418 కోట్ల పెట్టుబడులను క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. తాజాగా డిపాజిటరీ సమాచారం ప్రకారం జనవరి 1 నుంచి 3 మధ్యకాలంలో ఈక్విటీల నుంచి రూ.524.91 కోట్లను తరలించుకుపోయిన ఎఫ్‌పీఐలు..డెబిట్‌ మార్కెట్ల నుంచి రూ.1,893.66 కోట్ల ఉపసంహరించుకున్నారు. మొత్తగా గత మూడు సెషన్లలో రూ.2,418.57 కోట్లను ఉపసంహరించుకున్నట్లు అయింది. 2019లో దేశీయ మార్కెట్లోకి(ఈక్విటీ, డెబిట్‌) మార్కెట్లలోకి రూ.73,276.63 కోట్ల నిధులను తరలించారు. జనవరి, జూలై, ఆగస్టు నెలల్లో మినహా మిగతా అన్ని నెలల్లోనూత భారీగా నిధులను కుమ్మరించిన ఎఫ్‌పీఐలు..నూతన సంవత్సరం తొలి మూడు రోజుల్లోను తరలించుకుపోయినందున‌... ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారు త‌గు జాగ్ర‌త్త ప‌డాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: