అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి.  జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.  ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకొచ్చారు.  ఇప్పుడు దానికి కార్యరూపం ఇస్తున్నారు.  మొదట సెక్రటేరియట్ ఏప్రిల్ 6 నుంచి విశాఖలో ఉంటుందని అనుకున్నారు.  కానీ, ఈనెలలోనే సెక్రటేరియట్ తరలింపుకు ప్లాన్ చేస్తున్నారు.  


ఇందులో భాగంగానే ఈనెల 20 లేదా 21 వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కాబోతున్నది.  అసెంబ్లీలో ఈ ప్రతిపాదనను పెట్టి అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత అక్కడి నుంచి సెక్రటేరియట్ ను తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకలు విశాఖ కేంద్రంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  


గతంలో బాబు కూడా ఒకసారి విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు జగన్ కూడా రిపబ్లిక్ వేడుకలు అమరావతిలో కాకుండా విశాఖలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.  21 తరువాత సెక్రటేరియట్ నుంచి ముఖ్యశాఖలైన జీఏడీ నుంచి మూడు సెక్షన్లు, ఫైనాన్స్ నుంచి రెండు సెక్షన్లు, మైనింగ్ నుంచి రెండు, హోం శాఖ నుంచి నాలుగు, ఉన్నత విద్య, పాఠశాల విద్య నుంచి రెండేసి సెక్షన్లు.. రోడ్లు భవనాలు, ఆరోగ్య శాఖల నుంచి నాలుగేసి సెక్షన్ల చొప్పున  విశాఖకు తరలించబోతున్నారు. 


వీటితో పాటుగా జగన్ సీఎం ఆఫీస్ కూడా తరలించే అవకాశం ఉన్నది.  విశాఖలోని సన్ రైజ్ టవర్స్ లో జగన్ కార్యాలయం, మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.  జనవరి 20 తరువాత కొంతమొత్తంలో తాత్కాలికంగా అక్కడ ఈ కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు.  వీటి తరువాత ఎక్కడ వేటిని ఏర్పాటు చేస్తారు అన్నది తెలియాల్సి ఉన్నది. ఇప్పటికే అమరావతి రైతులు దీనిని అడ్డుకుంటున్నారు.  ప్రతిపక్షాలు కూడా ఈ ఏర్పాటుకు అడ్డుపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: