వైఎస్ జగన్ ఈసారి కోర్టు వాయిదాకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే అని ఇటీవలే సీబీఐ న్యాయస్థానం చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినీతి కేసులో విచారణకు హాజరుకావాల్సిరావడం జగన్ కు ఇబ్బంది కలిగించే పరిణామమే. అందుకే ఆయన ఇన్నాళ్లూ మినహాయింపు కోరుతూ వచ్చారు. మొదట్లో కొన్నాళ్లు జగన్ విజ్ఞప్తిని కోర్టు కూడా మన్నించింది.

 

కానీ ప్రతిసారీ ఇలా గైరు హాజరు కావడం కుదరదంటూ తాజాగా సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. ఎంత సీఎం అయినా కోర్టు రూల్స్ పాటించాల్సిందేనంటోంది. దీంతో ఈసారి వాయిదాకు జగన్ కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ అంశంపై టీడీపీ విమర్శల దాడి మొదలైంది. జగన్ పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు మరో కోర్టు షాక్ ఇచ్చింది.

 

2012 నాటి కేసులో ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వారితో పాటు ఏ3, 4లుగా ఉన్న అప్పటి పరకాల వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ చేసింది. వీరందరూ ఈనెల 10న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంది. ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరకాల పోలీస్‌స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది.

 

విచిత్రం ఏంటంటే.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ కూడా అదే రోజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే విజయలక్ష్మి, షర్మిలకు సమన్లు ఇప్పుడే అందాయి కాబట్టి.. ఏదో ఒక కారణంతో హాజరునుంచి మినహాయింపు కోరే అవకాశం ఉండొచ్చు. వారు పదో తారీఖును కోర్టుకు వెళ్లే అవకాశాలు తక్కువే. జగన్ మాత్రం.. సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరు కాక తప్పని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: