విశాఖపట్నం లో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి అనువైన భవనాల కోసం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గా దృష్టి సారించారు . బీచ్ రోడ్డులోని ఒక స్టార్ హోటల్ లో నెలప్రాతిపదికన అద్దెకు  ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతం లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో అద్దెకున్న విషయం తెల్సిందే . అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు . స్టార్ హోటల్ తోపాటు మరికొన్ని భవనాలను కూడా పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు .

 

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్న ప్రాంతాల్లో భవనాల కోసం ఆరాతీస్తున్నారు . ఇక ముఖ్యమంత్రి శాశ్వత ప్రాతిపదికన నివాసం ఉండేందుకు రుషికొండ , మధురవాడ , భీమిలి , కాపులుప్పాడ , తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో అనువైన  స్థలాలు , భవనాల కోసం అన్వేషిస్తున్నారు . విశాఖ నగరాన్ని  ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటుకు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లో  సన్నాహాలు చేస్తోంది . ఈ మేరకు లాంఛనాలన్నీ పూర్తి చేసేపనిలో నిమగ్నమైంది . దానితో విశాఖ నగరం లో ముఖ్యమంత్రి నివాసం ఉండేందుకు అనువైన భవనం కోసం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్వేషణ ప్రారంభించినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి .

 

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం  రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రెండు కమిటీల నివేదిక కూడా రాజధాని నగరంగా  విశాఖ నే సూచించిన  తెల్సిందే  . ఈ రెండు కమిటీల నివేదిక అధ్యయనం కోసం  రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ కూడా నేడు సమావేశమై , రాజధానిపై తుది నిర్ణయం తీసుకోనుంది . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ శాఖలను విశాఖకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెల్సింది . ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం . 

మరింత సమాచారం తెలుసుకోండి: