ఏపీ రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసిపి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అతికొద్ది సమయంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తో పాటు మిగతా వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు ఏదో రకంగా వైసీపీ ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. అలాగే ఏదో ఒక రకంగా బీజేపీ వైసిపి మధ్య రాజకీయ వైరం సృష్టించే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. దీనిలో భాగంగానే అమరావతి విషయంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన బాబు బినామీలుగా పేరుపడ్డ కొంతమందిని రంగంలోకి దించి వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.


 జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న కొంతమంది బిజెపి నాయకులు, రాజ్యసభ సభ్యులు తమ అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ చేస్తున్న ప్రతి పనిని విమర్శిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ బిజెపి వైసిపి ల మధ్య రాజకీయ దూరం పెంచుతున్నారు. ఈ వ్యవహారంతో ఒకరకంగా వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో జగన్ కు బంధువుగా, అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోదీని కుటుంబంతో సహా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. 


ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి చేస్తున్న రాజకీయ రాద్ధాంతం పైన మోదీకి మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జగన్ కు అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాల్సిందిగా ఆ భేటీలో మోహన్ బాబు కోరినట్టు సమాచారం. ఇక మోహన్ బాబు ఇంత అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడం వెనుక వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన సూచన మేరకు మోహన్ బాబు మోదీ, అమిత్ షాలను కలిసి జగన్ మాటలను తన మాటలుగా చెప్పి జగన్ ప్రభుత్వం పై వారికి సానుకూల దృక్పథం ఏర్పడేలా చేసినట్టు తెలుస్తోంది. 


మోహన్ బాబు  మాటలను శ్రద్ధగా విన్న మోదీ,అమిత్ షా, జగన్ ప్రభుత్వంపై సానుకూల దృక్పథం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదంతా విజయసాయిరెడ్డి వేసిన రాజకీయ ఎత్తుగడగా తెలుస్తోంది. మోహన్ బాబు కాకుండా వేరే ఎవరైనా మోదీని కలిసి ఉంటే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఈ విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే మోహన్ బాబు ప్రధానిని కలిసిన తర్వాత ఆ భేటీ వివరాలను చెప్పేందుకు నిరాకరిస్తున్నట్టు అర్థమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: