రాజకీయాల్లో ఎంత అనుభవం ఉన్నా ఒక్కో సందర్భంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. భవిష్యత్తు అంధకారంగా మారి భయపెడుతుంది. గతంలో చేసిన కొన్నిరాజకీయ దూకుడు చర్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఇప్పుడు అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కి వచ్చి పడింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అనంతపురం జిల్లాలో జేసీ రాజకీయాలకు అడ్డే లేకుండా ఉండేది కాదు. అందుకే ఆయన జిల్లాపై ఎప్పుడూ తన ముద్ర ఉండేలా చూసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చర్యలు అనేక సందర్భాల్లో వివాదాస్పదమయ్యాయి. అయినా జేసీ పై చర్యలు తీసుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వం ముందుకు వెళ్ళలేక పోయింది. 


ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒకపక్క దివాకర్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు దాడులు నిర్వహిస్తుండగా మరోపక్క కేసులు. ఇలా ఏదో ఒక విషయంపై జేసీ బ్రదర్స్ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గతంలో పరిటాల రవి హత్య జరిగిన సమయంలో అందులో జె.సి.దివాకర్ రెడ్డి పాత్ర ఉందని ప్రచారం జరిగింది. అప్పుడు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కని జేసీ ప్రస్తుతం ఓ చిన్న కేసులో పోలీస్ స్టేషన్ కి వెళ్లడమే కాకుండా అక్కడ ఎనిమిది గంటలపాటు వేచి చూడాల్సి వచ్చింది. ఇది అవమానంగా జేసీ భావిస్తున్నారు. 


తనను మానసికంగా, ఆర్థికంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో వైసిపి ప్రభుత్వం ఈ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని దివాకర్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ పరిణామాలు ఎప్పుడు ఎదుర్కోలేదని జేసీ బాధపడిపోతున్నాడు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా రాజశేఖర్ రెడ్డి  పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ జగన్ మాత్రం జేసీ విషయంలో సానుకూల దృక్పథంతో లేడు. ఇక ముందు ముందు కూడా తాను టిడిపిలో ఉంటే ఇదే విధమైన ఇబ్బందులు జగన్ నుంచి వస్తాయనే ఉద్దేశంతో జెసి బిజెపికి సన్నిహితంగా మెలుగుతున్నారు. అందుకే రాజకీయంగా తనకు బాగా జూనియర్ అయిన బిజెపి నాయకుడు సత్యను కలిశారు. 


అలాగే అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసేందుకు హెలిప్యాడ్ వరకు వెళ్లారు. ఇలా ఒక్క బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అయితే బిజెపిలో తాను చేరేది లేదని, చెబుతూనే ఆ పార్టీ తో సన్నిహితంగా మెలగడం వల్ల జగన్ ప్రభుత్వం నుంచి రక్షణ పొందవచ్చు అనేది జేసీ ప్లాన్. అందుకే టిడిపి లోనే ఉంటూ బిజెపికి సపోర్ట్  చేయాలనే నిర్ణయానికి జెసి వచ్చినట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: