రాజధాని అమరావతి తరలింపు వెనుక కేంద్రప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.  నిజానికి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనపై అధికారికంగా కేంద్రప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ బిజెపి నేతలు మాత్రం రకరకాలుగా మాట్లాడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. ఉద్దేశ్యపూర్వకంగానే కొందరితో అనుకూలంగాను మరికొందరితో వ్యతిరేకంగా కేంద్రంలోని పెద్దలే మాట్లాడిస్తున్నట్లు సమాచారం.

 

జగన్ ఆలోచనల ప్రకారం రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నానికి తరలిస్తే వెంటనే బిజెపి రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యిందట. ఎందుకంటే కేంద్రప్రభుత్వంగా జగన్ ను అడ్డుకునే అవకాశం లేదు కాబట్టి పార్టీ పరంగా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని స్కెచ్ వేస్తోందని సమాచారం. ఎందుకంటే ఇప్పటి వరకూ రాష్ట్రంమొత్తం మీద బిజెపికి బలమైన జిల్లా కానీ నియోజకవర్గం కానీ ఒక్కటి లేదు.

 

ఈ నేపధ్యంలోనే రైతుల పేరుతో చంద్రబాబునాయుడు ఆందోళనలు చేస్తున్నా  జనాల్లో పెద్దగా స్పందన లేదన్న విషయం కేంద్రప్రభుత్వంతో పాటు బిజెపి పెద్దలు కూడా గ్రహించారు. అందుకనే టిడిపి స్ధానంలో  తాను కుదురుకోవాలని బిజెపి అనుకుంటోంది. అందుకనే కనీసం రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాల్లో టిడిపికి ప్రత్యామ్నాయంగా తమ పార్టీని పటిష్టం చేయాలని బిజెపి సీనియర్ నేతలు ఆలోచిస్తున్నారట.

 

బిజెపిలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరిని పై జిల్లాల్లో  ముందుకు తెచ్చి ప్రధానంగా కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలన్నది బిజెపి అసలు ప్లానంటున్నారు.  అవసరమైతే పురంధేశ్వర భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా యాక్టివ్ అయి ప్రకాశం జిల్లాలోని కమ్మోరిని కూడా బిజెపి వైపుకు తీసుకొస్తారని అంచనాలో ఉంది పార్టీ అధిష్టానం.

 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పట్లో పురంధేశ్వరి రెండుసార్లు ఎంపిగా గెలిచారంటే కాంగ్రెస్ తరపున పోటి చేయటమే ప్రధాన కారణం. ఆమెకు కానీ దగ్గుబాటికి కానీ సొంతంగా వర్గమంటూ ఎప్పుడూ లేదు. పార్టీ బలమే వాళ్ళ గెలుపుకు కీలకమన్న విషయాన్ని వాళ్ళతో పాటు పార్టీ పెద్దలు కూడా మరచిపోతున్నారు. సరే ఎవరి స్కెచ్ లు వాళ్ళు వేస్తారు కానీ చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: