రాష్ట్రంలో ప్రస్తుతం రాజధాని రగడ జరుగుతున్నది.  ఈ రగడ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.  ఈ ప్రయత్నంలో భాగంగానే మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకురావడంతో అమరావతి ప్రాంతం భగ్గుమన్నది.  అమరావతి రాజధానిని మారిస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది.  విశాఖ ప్రజలు రాజధానిని అడగలేదని, ప్రశాంతంగా ఉన్న విశాఖకు రాజధాని పేరుతో అలజడి సృష్టించవద్దని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.  


పైగా విశాఖలో వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేని పరిస్థితి.  అందుకే విశాఖలో రాజధాని వద్దని అంటున్నారు.  ఇక రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యన్నారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు.  రాజధాని అంశం ఇంకా కొలిక్కి రాలేదని, రాజధాని విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దానిపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.  


రాజధాని విషయంలో ప్రభుత్వం స్థిరమైన నిర్ణయమే తీసుకుంటుందని అన్నారు.  రిపబ్లిక్ డే విషయంలోను స్థిరమైన నిర్ణయం తీసుకోలేదని, నిర్ణయం తీసుకుంటే ప్రజలకు చెప్తామని అంటున్నారు.  రైతులు ధైర్యంగా ఉండాలని అంటున్నాడు బొత్స.  రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జగన్ న్యాయం చేస్తారని, ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు.  గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం  శాశ్వత బిల్డింగ్ కూడా కట్టలేదని, తాత్కాలిక భవనాల్లోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని అన్నారు.  


ఇక రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఉద్యమం మొదలైంది.  దీనిపై బొత్స స్పందించారు.  రాయలసీమలో నీళ్లు లేవని, అలాంటి సమయంలో అక్కడ రాజధాని అంటే ఇబ్బందులు వస్తాయని, రాయలసీమ వాసులకు రాజధాని కంటే నీరు చాలా ముఖ్యమని, నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్టు బొత్స చెప్తున్నాడు.  మొత్తానికైతే ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుంటే తెలియకుండా ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: