బస్సు యాత్రల పేరుతో  ఉద్రిక్తతలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.  ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. టీడీపీ నేతలు 20 రోజులుగా అమరావతి లెజిస్లేటివ్‌ రాజధానిగా కొనసాగుతుందని చెబుతున్నా రాజధాని తరలిపోతోందంటూ  హంగామా చేస్తున్నారన్నారు. రాజధాని తరలిస్తామని ప్రభుత్వం చెప్పకపోయినా.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కలిసి  ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు ఎటువంటి అన్యాయం చేయదన్నారు.


మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..  విధ్వంసానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని  ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో  జేఏసీ ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రోజుకో డ్రామాతో రక్తి కట్టిస్తున్నారన్నారు. బెంజ్‌ సర్కిల్‌లో నడిరోడ్డుపై బైఠాయించి కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. ఇక మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌  ప్రజల్లో ఏడు నెలల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌కు  మంచిపేరు రావడాన్ని తట్టుకోలేక చంద్రబాబు కుట్రలు, రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజధాని ముసుగులో రైతులు, మహిళలు, న్యాయవాదులను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పరపతిని కాపాడుకోవడానికి హింసను, విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.   

 

రాష్ట్రంలో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో  అల్లర్లు సృష్టించేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.  ఆయన మీడియాతో బుధవారం గుడివాడలో మాట్లాడుతూ బెంజ్‌ సర్కిల్‌లో బస్సుయాత్ర పేరుతో రాజకీయం చేయటం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు.ఇక హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత  ప్రతిపక్ష నేత చంద్రబాబు వర్గ విభేదాలు సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. ఆమె బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

 

 బుధవారం ర్యాలీకి అనుమతులు ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ర్యాలీ చేసి స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏదైనా అవసరమైతే శాంతియుతంగా చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  ఎమ్మెల్యే అంబటి రాంబాబు   రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తూ, సంఘ విద్రోహ శక్తిగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని తేల్చిచెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: