హైకోర్టు కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తు  జారీ చేసింది. నామినేషన్‌లు పది నుంచి 12వరకు  స్వీకరించి 24న పోలింగ్ నిర్వహించి, 27న ఓట్ల లెక్కింపు చేపడతారు. రెండు రోజులు ఆలస్యమైనా ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ కావడంతో రాజకీయ పార్టీలతోపాటు అశావాహులు నామినేషన్ వేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికలు  కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో రెండు రోజులు ఆలస్యంగా జరుగుతున్నాయి. 

 

ఎన్నికల సంఘం అన్నిమున్సిపాలిటీలతోనే ఎన్నికలు నిర్వహించేలా  షెడ్యూల్ ప్రకటించినప్పటికి 3, 24, 25డివిజన్ల ఓటర్ల జాబితాలో తప్పులను ఎత్తిచూపుతు ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీ ఓట్లను బీసీలుగా, బిసి ఓట్లను ఎస్సీ, ఎస్టీలుగా చూపడంతో మూడు డివిజన్ ల రిజర్వేషన్లు తారుమారయ్యాయి. దీంతో స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. ఎన్నికలను  ఓటర్ల జాబితా సవరించిన తర్వాతే  జరపాలని కోర్టు ఆదేశించడంతో 7న జారీ కావాల్సిన నోటిఫికేషన్ ఎన్నికల సంఘం నిలిపివేసింది. దీంతో ఆగమేగాలమీద మున్సిపల్ అధికారులు మూడు డివిజన్ ల ఓట్లర్ల జాబితాలోని తప్పులను సవరించి ప్రభుత్వ పెద్దలతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ప్రభుత్వ అప్పీల్ ను స్వీకరించిన డివిజన్ బెంచ్, విచారించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

కోర్టు కాఫీ అందిన తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ లో స్వల్ప మార్పు చేస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం నామినేషన్ లు ఈనెల10 నుంచి 12వరకు  స్వీకరిస్తారు. 13న స్క్రూటిని చేసి, 14, 15న అభ్యంతరాలు స్వీకరిస్తారు.  16న ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. పోలింగ్ ను 24న నిర్వహిస్తారు. అన్ని మున్సిపాలిటీలకు 22న పోలింగ్ జరిగితే ఒక్క కరీంనగర్ నగర పాలక సంస్ధకు మాత్రం 24న జరుగుతుంది. అన్ని మునిసిపాలిటీలకు ఓట్ల లెక్కింపు 25న జరిగితే,  కరీంనగర్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు 27న జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎట్టకేలకు నోటిఫికేష్ జారీ కావడంతో నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే బి ఫామ్‌లు ఇచ్చే పనిలో టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన మంత్రి గంగుల కమలాకర్,  నిమగ్నమయ్యారు. అటు బిజేపి అభ్యర్థులను ఎంపి బండి సంజయ్ ఎంపిక చేస్తున్నారు. 

 

కాంగ్రెస్ అభ్యర్థులను టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో 16మందితో కూడిన ఎన్నికల కమిటీ ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యింది. శుక్రవారం రాత్రిలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి వారంరోజుల పాటు జోరుగా ప్రచారం చేయనున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు నెలకొనడం, రెండు రోజులు ఆలస్యంగా ఎన్నికలు జరుగుతుండడంతో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి నిర్లక్ష్యంపై రాజకీయ పార్టీల నేతలతోపాటు నగర ప్రజలు మండిపడుతున్నారు. కమిషనర్‌పై చర్యలకు అటు ప్రభుత్వం సిద్దమయ్యింది. కాగా ఎట్టకేలకు నోటిపికేషన్ జారీ కావడంతో కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి నగరంలో సందడి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: