ఏపీలోనే కాకుండా తెలంగాణ‌లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ రాజ‌ధాని త‌ర‌లింపు. వివిధ వ‌ర్గాలు త‌ర‌లింపును నిర‌సిస్తూ, స‌మ‌ర్థిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే, కీల‌క‌మైన సినీ ప‌రిశ్ర‌మ స్పంద‌న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌హిరంగంగా స్పందించింది కొంద‌రే. మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు సోద‌రుడి కుమారుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ‘అమరావతిలో పోరుకు సై’ అంటూ సంఘీభావం ప్ర‌క‌టించాడు.

 

నారా రోహిత్ ప్ర‌క‌ట‌న‌తో నంద‌మూరి కుటుంబ సినీ న‌టుల‌పై స‌హ‌జంగానే ఫోక‌స్ ప‌డింది. నారా రోహిత్ స్పందించాడు కానీ...తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, స్వ‌యంగా చంద్ర‌బాబు వియ్యంకుడైన బాల‌య్య బాబు జాడ ఈ ఆందోళ‌న‌ల్లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను స‌మ‌ర్థిస్తున్నారా? వ‌్య‌తిరేకిస్తున్నారా? అనే క్లారిటీ బాల‌య్య ఇవ్వ‌లేదు. మ‌రోవైపు నంద‌మూరి యువ హీరో ఎన్టీఆర్ సైతం రాజ‌ధానుల అంశంపై పెద‌వి విప్ప‌డం లేదు. దీంతో...నంద‌మూరి కుటుంబం రాజ‌ధానిపై ఏ వైఖ‌రితో ఉంద‌నే క్లారిటీ రావ‌డం లేదు.

 

కాగా, నారా రోహిత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌ద్ద‌తిచ్చాడు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణ సమానమైన భూముల త్యాగం చేసి.. అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను’. అని ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: